జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరణ
హైదరాబాద్: జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్ పాఠశాల ఉపాధ్యాయుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టీచర్స్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.

- సరికొత్త ప్రయోగం – హీరో జయంత్
ఈ సందర్భంగా హీరో జయంత్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లతో పాటు, నేటి విద్యావ్యవస్థలోని తీరుతెన్నులను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది ఒక కొత్త తరహా ప్రయోగం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు.
- ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ ఆధారంగా తెరకెక్కించాం – దర్శకుడు నవీన్ దేశబోయిన
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ‘‘32 అవార్డులతో పాటు నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న ‘లతా భగవాన్ ఖరే’ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మలయాళంలో 111 రోజులు ప్రదర్శితమై ఘనవిజయం సాధించిన ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో పాటు, విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలను ఇందులో చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
- టీచర్స్ డే రోజున ఫస్ట్ లుక్ రావడం గర్వంగా ఉంది – సత్యం రాజేష్
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘‘ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి చేతుల మీదుగా నేను ఉపాధ్యాయుడిగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు.
- పాఠశాల ఒక దేవాలయం.. ఉపాధ్యాయులే దేవుళ్లు – నిర్మాత దివ్య
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో పాఠశాల ఒక దేవాలయం.. ఉపాధ్యాయులే దేవుళ్లు. అందుకే ఈ సినిమా ప్రమోషన్లను కూడా పాఠశాల నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ చిత్రాన్ని నిర్మించడం నాకు, నా భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు.
ఈ చిత్రంలో జయంత్, తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, మానస రాధాకృష్ణన్, ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

- సాంకేతిక నిపుణులు:
సంగీతం: మోహిత్ కులకర్ణి
ఛాయాగ్రహణం (DOP): ఆండ్రూ బాబు
కథనం, మాటలు, పాటలు: ప్రవీణ్ బొలిశెట్టి
ఎడిటింగ్: నందమూరి హరి తారక రామారావు
ఆర్ట్ డైరెక్టర్: నాని
నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
దర్శకత్వం: నవీన్ దేశబోయిన
–