తెలంగాణ ఉద్య‌మ కెర‌టం డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్

Uncategorized

ఎడిటోరియ‌ల్
తెలంగాణ ఉద్య‌మం.. ప్ర‌పంచంలోనే జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. ఉద్య‌మ‌కారుల బ‌లిదానాలు, ఉద్య‌మ‌కారుల నిర్భందాలు.. వంటివి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ‌నిర్మాత‌ డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ తొలి పీడీయాక్ట్ నిర్భందానికి గురై ప‌దేండ్లు పూర్త‌యింది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్‌లో చేరి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం చురుకైన పాత్ర పోషించారు. 2003 నుంచి 2014 వ‌ర‌కు 11 ఏళ్లపాటు అలుపెర‌గ‌ని ఉద్య‌మం చేశారు. వివిధ సంఘాలతో కలిసి పని చేసి ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించాడు. కేసుల‌కు బెద‌ర‌కుండా తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఉద్య‌మ గ‌ళాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపించారు. పార్టీ సూచించిన కార్య‌క్ర‌మాల‌న్ని విజ‌యవంతంగా నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఆంధ్ర పాల‌కులు చెరుకు సుధాక‌ర్‌పై ఎన్నో కేసులు పెట్టించారు.

2011లో ఉద్య‌మం ఉదృతంగా కొన‌సాగుతోన్న స‌మ‌యం. అక్టోబ‌ర్ 3న స‌క‌ల జ‌నుల స‌మ్మె. అందులో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్ర‌ధానంగా ఉంది. ఎలాగైనా బ‌స్సుల‌ను న‌డిపించాల‌ని స‌మైక్య పాల‌కుల ఆలోచ‌న‌. త‌లొగ్గ‌ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఉద్య‌మాన్ని నిర్వఈర్యం చేయ‌డానికి అక్టోబ‌ర్ మూడున ఆంధ్రా నుంచి పోలీసు కాన్వాయ్‌తో బ‌య‌లుదేరిన ఆంధ్రా పెట్టుబ‌డిదారుల బ‌స్సులు కోదాడ నుంచి దారిపోడుగునా మీడియా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు మున‌గాల ఆకుపాముల వ‌ద్ద స్ప‌ల్ప ఘ‌ర్ష‌ణ‌లు న‌కిరేక‌ల్‌లోనికి బ‌స్సులు ప్ర‌వేశించాయి. అప్ప‌టికే న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెలుపుతున్న డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్, వారి స‌హ‌చ‌రులు ప్ర‌జ‌ల‌తో ఒక్క‌సారిగా బ‌స్సుల‌పై దూసుకెళ్లారు. ఆ పోరాటం చూసిన రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ణ‌ఙ‌కిపోయింది. సుధాక‌ర్‌ను అరెస్ట్ చేసి న‌ల్ల‌గొండ జైలుకు త‌ర‌లించారు. అప్ప‌టికే త‌న కూతురు వివాహం నిశ్చ‌య‌మైంది. పెళ్లి ప‌త్రిక‌లు పంచుతున్నారు. నాన్న వివాహానికి వ‌స్తాడో రాడోన‌నే కూతురు ఆవేద‌న‌. న‌వంబ‌ర్ ఒక‌టిన విడుద‌ల త‌రువాత స‌హ‌చ‌రుల‌తో క‌లిసి రాత్రి భారీ ర్యాలీ నిర్వ‌హించారు. న‌వంబ‌ర్ మూడు అర్ధ‌రాత్రి పీడీ యాక్ట్ ప్ర‌యోగించి చెరుకు సుధాక‌ర్‌ను వ‌రంగ‌ల్ జైలుకు త‌ర‌లించారు.

చెరుకు సుధాక‌ర్‌ను పీడీ యాక్ట్ కింద నిర్భందించారు. ఇదే తొలి పీడీ యాక్ట్. చెరుకు సుధాక‌ర్‌ను నిర్భందించ‌డంతో తెలంగాణ అంతా అట్టుడికింది. ఉద్య‌మంలో చురుకైన పాత్ర వ‌హిస్తున్న చెరుకు సుధాక‌ర్‌పై అప్ప‌టి ఆంధ్ర‌పాల‌కులు క‌న్నెర్ర చేశారు. ఆయనపై సుమారు 18 కేసులు న‌మోదు చేయించారు. నాసా కింద కేసు పెట్టారు. బంద్‌లు, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. నాసా కింద ఎవరినైనా నిర్బంధిస్తే రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే సలహా మండలి దీనిని ద్రువీకరించాల్సి ఉంటుంది. సుధాకర్‌ను విడుదల చేయాలంటూ ఆయన సోదరుడు డాక్టర్ విజయబాబు, కొడుకు సహస్, భార్య లక్ష్మిబాయి, సోదరి వసంత పిటిషన్లు కూడా వేశారు. దీనిపై సీఎస్ పంకజ్ ద్వివేదీతోపాటు జస్టిస్ టీఎల్ఎన్‌రెడ్డి, మరో ఇద్దరు సభ్యులతో కూడిన సలహా మండలి సమావేశమై.. చెరుకు సుధాకర్ నిర్బంధంపై విస్తృతంగా చర్చించింది. ఆయనపై పోలీసులు చేసిన అభియోగాలతో ఏకీభవించింది. ఆయన నేరపూరిత చర్యలకు దిగే అవకాశాలున్నాయని, ఫలితంగా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సలహా మండలి తేల్చి చెప్పింది. చెరుకు సుధాకర్ సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు. ఆయనను ఏడాది పాటు నిర్బంధంలో ఉంచాలి.. అంటూ ఆ సలహా కమిటీ అప్ప‌టి ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఆ రోజు మొహర్రం సందర్భంగా సెలవు దినమైనప్పటికీ అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చెరుకు సుధాకర్ నిర్బంధంపై ఉత్తర్వులు జారీ చేసింది. జీవో విడుదల నాటి నుంచి సుధాకర్‌ను ఆరు నెల‌ల‌ పాటు వరంగల్ సెంట్రల్ జైల్లో నిర్భందించారు. ఉద్య‌మాన్ని ఎంత తొక్కివేస్తే అంత ఎగిసిప‌డుతుంది అనే విష‌యం స‌మ‌యంలో మ‌రోసారి రుజువైంది. తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఎగిసిప‌డ్డాయి. అట్టుడుకుతున్న తెలంగాణ‌ను ఇంకా ఆపే త‌రం ఎవ‌రి వ‌ల్లా కాదు అన్న సంకేతాలు ఢిల్లీ పెద్ద‌ల‌కు చేరాయి.

టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ అక్రమ నిర్బంధాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖండించారు. ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు.

ఉద్య‌మంలో అలుపెర‌గ‌ని పోరాటం చేసి జైలు జీవితం గ‌డిపిన‌ చెరుకు సుధాక‌ర్.. తెలంగాణ ఆవిర్భావ విజ‌యాన్ని సంబురాన్ని త‌న‌తోటి ఉద్య‌మ‌స‌హ‌చ‌రుల‌తో పంచుకున్నారు. ప్ర‌పంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం తెలంగాణ ఏర్పాటు అని నినదించారు. అయితే జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత చెరుకు సుధాక‌ర్‌కు సొంత పార్టీ టీఆర్ఎస్ మొండి చేయి చూపింది. 2004 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చెరుకు సుధాక‌ర్‌కు టికెట్ ఇవ్వ‌లేదు. పార్టీలో క‌నీస గౌర‌వం ఇవ్వ‌ని టీఆర్ఎస్‌కు ఆయ‌న దూర‌మ‌య్యారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదని.. సమైక్య పాలకుల పాలనకు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పాలనకు పెద్దగా తేడా లేకుండా పోయిందని సుధాక‌ర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సామాజిక శక్తులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కే సామాజిక తెలంగాణను సాధించేందుకు 2007లో ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

తెలంగాణ ఉద్యమకారుల కోసం మళ్లీ పోరాట జెండా ఎత్తుకున్నామని చెబుతోన్న చెరుకు సుధాక‌ర్.. ఆ దిశ‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తుతున్నారు. నిరంత‌రం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను త‌ప్పుప‌డుతూ ప్ర‌జా ఉద్య‌మాన్ని ఇంకా కొన‌సాగిస్తున్నారు. తెలంగాణ పోరాట చ‌రిత్ర‌లో అలుపెర‌గ‌ని, మ‌డ‌మ తిప్ప‌ని ఉద్య‌మ‌కెర‌టం డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *