PRIME TODAY సర్వే ఫలితాలు:
2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా?
బీజేపీ సారధ్యంలోని నరేంద్ర మోడీ పాలనకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? మోడీ మళ్లీ గెలుస్తాడా? అనే విషయాలపై ‘ప్రైమ్‌టుడే’ పోల్ నిర్వహించింది. గత వారం రోజుల పాటు నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 5వేల ఒక వంద మంది పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానిగా ఎవరిని కోరుకుంటారు? అనే ప్రశ్నకు స్పందించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘మోడీ ప్రధాని కావాలి’ అని 44 శాతం ప్రజలు ఓటు వేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 36 శాతం ప్రజలు కోరుకున్నారు. దేశంలో ‘మార్పు కావాలి’ అని ఏకంగా 18 శాతం మంది కోరుకున్నారు. ఇక డోలాయమానంలో ‘ఇప్పుడే చెప్పలేం’ అంటూ 2 శాతం మంది సమాధానాన్ని దాటవేశారు. ఈ సర్వే విశ్లేషణను బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, లేదా దేశంలో మార్పు కావాలని కోరుకునే వారంతా కలిపి 56 శాతం ఉన్నారు. అంటే 56 శాతం.. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు చెప్పుకోవచ్చు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 36 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. అంటే మోడీకి వచ్చిన 44 శాతం కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మోడీపై ప్రజల్లో ఇటీవల వ్యతిరేకత పెరిగినా కూడా కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపమనే చెప్పాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సరైన నిర్ణయం తీసుకుని తమ పార్టీకి సరైన లీడర్‌ను ప్రకటించాల్సి ఉండగా, ఇంత వరకు అడుగుముందుకు వేయలేదు. దీంతో ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజాధరణ కోల్పోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎప్పటికప్పుడు దేశప్రజల అభిప్రాయాలను, సర్వే ఫలితాలను మీ ముందుంచుతుంది ప్రైమ్‌టుడే.