ఒకే గొడుగు కిందకు ఎన్ఆర్ఐ టీడీపీ.. గురురాజా కొత్త కార్యాచరణ!

Latest News

హైద‌రాబాద్: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశారు. మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్రపై కీలక వివరాలను వెల్లడించారు. నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, విదేశాల్లో వెర్వేరుగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, కులమతాలు వృత్తులకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేసే క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా, విదేశాలకు వెళ్లే ప్రవాసాంధ్రులకు ఉద్యోగం, వైద్యం, కుటుంబ అత్యవసర సమయాల్లో అండగా నిలిచే ఒక భరోసా కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు.

విదేశాల్లో సంభవించే ప్రమాదాలు లేదా మరణాల సమయంలో సహాయపడటంతో పాటు, స్వదేశంలో ఉన్న ఎన్ఆర్ఐల కుటుంబాల భూములు, ప్రభుత్వ పనుల సమస్యలను పరిష్కరించడానికి కూడా ఒక వారధిలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

ఎన్ఆర్ఐలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్లే పరిపాటిని మార్చి, వారిని సొంత ఊళ్లతోనూ, బూత్ స్థాయి రాజకీయ–సామాజిక సంబంధాలతోనూ నిరంతరం అనుసంధానించడమే తమ వ్యూహమని గురురాజా వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక మ్యాచింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నామని, దీని ద్వారా అమెరికాలో కూర్చుని కూడా స్వగ్రామంలో ఉన్న వివిధ రంగాల పెట్టుబడి అవకాశాలను తెలుసుకునే వీలుంటుందన్నారు.

ప్రభుత్వ విభాగమైన ఏపీ ఎన్ఆర్టీ అందరికీ సేవలు అందిస్తే, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఒక పార్టీ ఆధారిత సంస్థగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీ అభిమానులను అధికారిక సభ్యులుగా మారుస్తూ, తొలి విడతగా లక్ష మందిని, తదనంతరం రెండు లక్షల మంది యాక్టివ్ సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీనికోసం ప్రత్యేక హెల్ప్‌లైన్, హాట్‌లైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

తన నలభై ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, 1982లో ఎన్టీఆర్ కమిట్మెంట్ వల్ల ప్రభావితుడనై డోన్ ప్రాంతంలో పార్టీకి పనిచేశానని, 2013లో నారా లోకేష్‌తో ఏర్పడిన పరిచయం తన పయనంలో కీలక మలుపని గురురాజా వ్యాఖ్యానించారు. అమెరికాలో పెద్ద వైద్యుడిగా స్థిరపడినప్పటికీ, చంద్రబాబు నాయుడితో ప్రయాణంలో “రాజకీయాల్లో ఒక సంతకంతో లక్షలాది మంది జీవితాలను మార్చవచ్చు” అనే మాట తనను ఎంతో ప్రభావితం చేసి ప్రజాజీవితం వైపు నడిపించిందని అన్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టుల పునర్నిర్మాణంతో ప్రవాసాంధ్రుల్లో మళ్లీ ఆశలు చిగురించాయని, అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరులకు పోటీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో కర్నూలు ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ ఉద్రిక్తతలు చంద్రబాబు పాలనలోనే అంతమయ్యాయని గుర్తుచేశారు. ప్రవాసాంధ్రులను పార్టీ విధానాలతో అనుసంధానించడం, బలమైన సంస్థగా తీర్చిదిద్దడం, తగిన గుర్తింపు నివ్వడం, పెట్టుబడులు–సమస్యల పరిష్కారానికి అనుసంధానకర్తగా ఉండడం, నిరంతర రోడ్‌మ్యాప్‌ను అందించడమే తమ ఐదు ప్రధాన లక్ష్యాలని చెబుతూ, పార్టీ ఇచ్చిన బాధ్యతను ఒక సైనికుడిలా నిర్వర్తిస్తానని గురురాజా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *