సీఎం కేసీఆర్ పోటీ చేసేది అక్కడనుంచేనా?

Latest News Political News

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల కంటే సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారని విషయమే ఆసక్తిగా మారింది. ప్రజలందరికీ ఇది ఆసక్తి కలిగించే అంశం అయితే కొద్దిమందికి మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. గెలిచిన నేత ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే అని చెప్పొచ్చు. వరుసగా సిద్దిపేటలో ఓటమి ఎరగని నేతగా ఉన్న కేసీఆర్.. ఉద్యమ భావ వ్యాప్తి కోసం కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచి దక్షిణ తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. మెదక్ ఎంపీగా కూడా గెలుపొందిన కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గంలోనూ గెలుపొందారు. వరుసగా రెండోసారి గజ్వేల్ నుంచి విజయకేతనం ఎగరవేశారు.

ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి.. విజయాలను ఖాతాలో వేసుకున్న కేసీఆర్ ఈసారి మళ్లీ తన సీటు తానే మార్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. గజ్వేల్ వదిలి మేడ్చల్ లో పోటీ చేస్తారని కొంతమంది, లేదు యాదాద్రి ఆలయం ఉన్న ఆలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తారని మరికొంతమంది.. ఇలా ఎన్నో రకాలుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక ఇవన్నీ కాదు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఈసారి పెద్ద సార్ ఎంచుకున్నారని టాక్ ఈ మధ్యకాలంలో మొదలైంది. ఇదంతా కాదు కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే సర్వే మొదలైంది.. కేసీఆర్ అక్కడి నుంచే బరిలో ఉంటారనేది మరో వర్గం వాదన.

ఇలా సీఎం కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారని విషయంలో భారత రాష్ట్ర సమితితో పాటు ఇతర పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే సార్ పోటీ చేస్తే ఎక్కడ మా సీటు గల్లంతవుతుందోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని సమాచారం.. ఏదీఏమైనప్పటికీ దీనిపై క్లారిటీ రావాలంటే గులాబీ దళపతి కే చంద్రశేఖర్ రావు స్పష్టత ఇవ్వాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *