మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈసారి బీసీల ఓట్లు కీలకం కానున్నాయనే సర్వే రిపోర్టుల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలపై నాయకులకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొస్తుందా అన్నట్టుగా తయారైంది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఫోన్ కాల్ చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. నియోజకవర్గంలో బీసీల్లో అధిక ఓటింగ్ ఉన్నయాదవ కులాన్ని ప్రసన్నం చేసుకునేలా ప్రయత్నిస్తున్నట్టు లీకయిన మల్లారెడ్డి ఆడియోను బట్టి తెలుస్తోంది. మల్లన్న జాతర చేయిస్తా.. 110 కుటుంబాలు నాకే ఓటెయ్యాలి.. అంటూ మల్లారెడ్డి యాదవ సామాజికవర్గం వ్యక్తికి ఫోన్ కాల్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయంశం అవుతున్నాయి. మేడ్చల్ సెగ్మెంట్‌లో బీసీల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి పోటీ చేసే బీసీ నాయకులు ఎవరు? ఎవరికి ఎంత బలం ఉంది. బీసీలు ఎటువైపు మొగ్గుచూపే అవకాశం ఉందో ఇవాల్టీ ఆనాలిసిస్‌లో తెలుసుకుందాం.
బీఆర్ఎస్‌లో ఇద్దరు
ఈ నియోజకవర్గంలో ముందు నుంచీ.. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. 2009 నుంచి చూసుకుంటే, కె.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గత 2018 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దాంతో.. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయ్. అంటే, ఇక్కడ ఈ టికెట్ కోసం పోటీపడేది ఇద్దరూ రెడ్డి నేతలే.
బీజేపీలో గందరగోళం
ఈ నియోజకవర్గం సెమీ అర్బన్ ఏరియా కావడంతో బీజేపీ కూడా ఇక్కడ గెలుపు ఆశలు పెట్టుకుంది. మేడ్చల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో.. జిల్లా ప్రెసిడెంట్ పట్లోళ్ల విక్రమ్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన కొంపల్లి మోహన్ రెడ్డి.. రేసులో ఉన్నారు. బీజేపీలోనూ ఇద్దరూ నేతలు పోటీ పడుతుండటంతో.. క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచి కూడా ఇద్దరూ రెడ్డి నేతలే టికెట్ కోసం తలపడుతున్నారు.
కాంగ్రెస్‌లో సరైనోడు
మేడ్చల్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గం.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి రావడం.. దానికి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండటంతో.. ఇక్కడ.. కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఇద్దరు నేతలు ఉన్నారు. మూడు చింతలపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మరో నేత టీ-పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర జంగయ్య యాదవ్ ఆలియస్ వజ్రేష్ యాదవ్. టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు.. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి బలబలాలు చూసుకుంటే, రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా వజ్రేష్ యాదవ్‌కు.. గుర్తింపు ఉంది. అన్నింటికి మించీ వజ్రేష్ యాదవ్ బీసీ నేత. యాదవ సామాజికవర్గం వ్యక్తి.
నిజానికి ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ అధికం. బీసీల్లో గౌడ్, ముదిరాజ్, యాదవ్ సామాజికవర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు రెడ్డిలు, బీజేపీ నుంచి ఇద్దరు రెడ్డిలు, కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో బీసీ వర్గానికి చెందిన ఒకే ఒక్కడు వజ్రేష్ యాదవ్. నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ ఉండటం, బీసీ నినాదం.. వంటి అంశాల నేపథ్యంలో ఈ సారి వజ్రేష్ యాదవ్‌కు టికెట్ ఇస్తే గెలుపు సులువు అని మేడ్చల్ సెగ్మెంట్‌లో చర్చ జరుగుతోంది. ఇటీవల వజ్రేష్ యాదవ్ దూకుడు పెంచారు. ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతూ, నియోజకవర్గంలో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తమ్మీద ఈసారి మేడ్చల్ టెంపరేచర్ మరింతా హీటెక్కనుంది.
—
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి