హైదరాబాద్ (పోచారం): బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో జల దోపిడీ జరిగిందే తప్పా ఏ ఒక్క ఇంటికి, ఏ ఒక్క గ్రామానికి నీళ్లు అందించిన పాపాన పోలేదని, అదే జరిగితే నేడు పోచారం మున్సిపాలిటీలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది మంత్రి మల్లారెడ్డీ.. అంటూ టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రశ్నించారు. నగర శివారు మున్సిపాలిటీ అయినా పోచారం మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కృష్ణా నది నీళ్లు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలకు నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైఖరిని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ” గొంతు తడపని కృష్ణానది నీళ్లు నిరసన దీక్ష” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. పోచారం మున్సిపాలిటీ ప్రాంతంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది కేవలం స్వర్గీయ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందని అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందో తెలియజేయాలన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన వాటర్ ట్యాంకులకు టిఆర్ఎస్ పార్టీ రంగులు వేయడం తప్పా నూతన ట్యాంకుల నిర్మాణం, నల్ల కనెక్షన్లు ఎక్కడ ఇచ్చిందో మంత్రి మల్లారెడ్డి తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యలు తీర్చలేని స్థితిలో ఉన్న BRS ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 4000 రూపాయల పెన్షన్, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు.