ఇలా వస్తున్నారు… అలా వెళ్తున్నారు!
నగరానికి ఐదేళ్లలో ఐదుగురు కలెక్టర్లు
పెరుగుతున్న అక్రమాలు.. మూలుగుతున్న దస్త్రాలు
హైదరాబాద్: రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. వేలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పరిపాలనపై పట్టు సాధించేలోపు అధికారులను బదిలీ చేయటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అక్రమార్కులకు ఊతమిచ్చేందుకు కారణమవుతోంది. హైదరాబాద్ జిల్లాకు ఐదేళ్ల వ్యవధిలో ఐదుగురు కలెక్టర్లు మారారు. దీంతో సర్కారు స్థలాల పరిరక్షణ నేతిబీరచందంగా మారింది. సంక్షేమ పథకాల అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. బదిలీపై వచ్చిన అధికారులకు అవగాహన వచ్చేలోపు స్థానచలనం కావటంతో కీలకమైన దస్త్రాలు కూడా ఏళ్లుగా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ప్రజాసేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో విధుల్లో చేరిన ఐఏఎస్‌లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. నగరంలో బాధ్యతలు కేవలం ప్రొటోకాల్ కలెక్టర్‌గా ముద్ర వేస్తున్నాయంటూ గతంలో పనిచేసిన ఓ ఐఏయస్ అధికారి ఆవేదన వెలిబుచ్చారు.
- రాజధాని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలున్నాయి. కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్న ఐఏఎస్‌ల్లో అధికశాతం పదోన్నతి ముందు వస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో చేరుతున్నారు. న్యాయస్థానాల్లోని కీలకమైన కేసులు, దస్త్రాలు, ప్రజల దరఖాస్తులు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో 16 రెవెన్యూ మండలాలున్నాయి. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కుల, ఆస్తి, నిరభ్యంతర తదితర ధృవీకరణపత్రాలు, సేవలు తహసీల్దార్ కార్యాలయాల్లో అందుతుంటాయి. పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ పెత్తనం సాగుతోంది. యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నా చూసీచూడనట్టుగా ఉండాల్సి వస్తోందంటూ ఓ తహసీల్దార్ ఆవేదన వెలిబుచ్చారు.
సామాన్యులకే ఇబ్బందులు
2016లో హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ యోగితారాణా ఏడాదిన్నరకు పైగా పనిచేశారు. అనంతరం వచ్చిన రఘునందన్‌రావు, కె.మాణిక్‌రాజ్ నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో శ్వేతామహంతి బాధ్యతలు చేపట్టారు. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లటంతో ప్రస్తుతం 2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ శర్మన్ కలెక్టర్‌గా నాగర్‌కర్నూల్ నుంచి బదిలీపై వచ్చారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖుల పర్యటనల్లో కలెక్టర్ ప్రొటోకాల్ పాటించాలి. దీంతో అధికశ ాతం సమయం అక్కడే వెచ్చించాల్సి వస్తోంది. జిల్లా పరిస్థితులపై అవగాహన, కీలకమైన దస్త్రాలు పరిశీలించేందుకు సమయం కేటాయించలేక పోతున్నారు. రెవెన్యూ డివిజన్, తహసీల్దార్ కార్యాలయాల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆయా సెక్షన్లలోనే పేరుకుపోతున్నాయి. జిల్లాలో రెండు పడక గదుల కోసం సుమారు 2.5లక్షల దరఖాస్తులు వచ్చాయని అంచనా. ఆసరా పింఛన్లు- 6000, షాదీముబారక్, కల్యాణలక్ష్మి- 10,000, నిరభ్యంతర ధృవీకరణ పత్రాలకు 3000, కుల, ఆదాయం కోసం 4500 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. మరోవైపు నగరవ్యాప్తంగా భూ ఆక్రమణలు పెరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం ల్యాండ్‌బ్యాంక్ ద్వారా ప్రభుత్వ స్థలాలు గుర్తించారు. గతంలో స్థలాలను క్రమబద్దీకరించుకున్న లబ్ధిదారుల నివాసాల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలు 60-70శాతం వరకూ ఆక్రమణలకు గురైనట్టు తేల్చారు.