ఎన్నికల కమిషన్ లేఖలో ఏం పేర్కొంది..
హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. రేపో మాపో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అవుతుందని, రాజకీయ పార్టీలన్నీ ఊహిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు చేపట్టాలో లేదో అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఆగస్టు 30వ తేదీ లోగా అభిప్రాయాన్ని వెల్లడించాలని లేఖలో తెలపడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది.
ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ నేతలకు లేఖ రాసింది. ఆగస్టు 30వ తేదీ లోగా వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు.. 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై అభిప్రాయాలు తెలియజేయాలని లేఖలో కోరారు. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికలు నిర్వహించడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆగస్టు 30 తర్వాతే ఈ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలతో ముందుకు వెళ్లడం లేదని మద్రాస్ హైకోర్డు ఎన్నికల సంఘానికి అంక్షింతలు వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాజకీయ పార్టీల అభిప్రాయాల ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లనుంది. హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితులను తెలపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. హుజురాబాద్‌తో పాటు త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉండటంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేర్పులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసుల వినియోగం, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది తదితర వివరాలను సీఈసీ కోరింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉండటంతో
అధికార పార్టీలో కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా.. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
వివిధ పథకాలను నియోజకవర్గంలో ప్రకటిస్తూ అధికార పార్టీ ముందుకువెళ్తోంది. తాజాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కొంత ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలస్యం అనేది తమకు కూడా అనుకూలంగా ఉంటుందని వివిధ పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.