హుజూరాబాద్ (huzurabad) పోరులోలో డీకొట్టెందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరి పోరాటం కొనసాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికపై ఊగిసిలాట కొనసాగింది. రెండు పార్టీలకు దీటుగా ఉండే అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినా..పరిస్థితులు మాత్రం అనుకూలించలేక పోయాయి.
కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వెంకట్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాం పూర్ మండలం తరాలపల్లి . కాగా వెలమ కులానికి చెందిన వెంకట్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.. ఇంవా వివాహం కూడా కాలేదు.. కాగా 2018 ముందస్తు ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్ ఆశించినప్పటికీ వెంకట్‌కు టికెట్ లభించలేదు . ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ .. అనేక విద్యార్థి సంబంధిత అంశాలపై ఎన్ఎస్‌యూఐని క్రియా శీలకంగా నడిపించడంతో పాటు మంత్రి మల్లారెడ్డి అవినీతి విషయంలో ఆందోళనలు చేసి కేసుల పాలయ్యారు . కరోనా తదనంతర విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నారు . ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వెంకట్‌ను బరిలో దింపుతున్నామని టీపీసీసీ ముఖ్యనేతలు ఒకరు వెల్లడించారు .
మరోవైపు పార్టీలో కష్టపడినవారికే ఇక నుండి పదవులు దక్కుతాయని, కష్టపడే కార్యకర్తలను గుర్తించి పదవులను తానే స్వయంగా తెచ్చి ఇస్తానని రేవంత్ రెడ్డి యూత్‌కాంగ్రెస్ సమావేశంలో చెప్పారు. అయితే అందుకు అనుగుణంగా పనిచేసేవారికే భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. అంతేగాని నాయకుల వెంట తిరిగడం లేదా ఢిల్లీ నుండి పైరవీలతో పదవులను దక్కించుకోవడం ఇక కుదరని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే పార్టీలో యువతను ప్రొత్సహించేందుకు ఆ యూత్ కాంగ్రెస్ నాయకులకు హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రకటించడంతో రానున్న ఎన్నికలకు యూత్‌ను సమాయత్తం చేయడంతో పాటు పార్టీ ప్రయోజనాలు కాపాడే అవకాశాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేకపోయినా.. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువతకు స్థానం కల్పించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుండి ఈటల రాజేందర్‌లు పోటి చేస్తుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మొదటి రోజే నామినేషన్ వేయగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌లు నామినేషన్లు వేయాల్సి ఉంది.