గత కొద్ది రోజులుగా జైలు జీవితం గడుపుతున్న తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ బీజేపీలో చేరుతున్నట్టు క్యూ న్యూస్ ప్రకటించింది. మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. మరోవైపు ఆయన్ను జైలు నుండి విడుదల చేయించాలని ఆయన భార్య సైతం ప్రధాని మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షాకు ఈమెయిల్ ద్వారా వేడుకుంది.
అయితే, గత కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ పెట్టిన కేసులో ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. అయితే కేసులో బెయిల్ వచ్చినా.. తిరిగి మరో కేసులో కోర్టుకు తరలించారు. దీంతో మరో పద్నాలుగా రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయనపై పదికి పైగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో తీన్మార్ మల్లన్న చివరికి బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక జైలుకంటే ముందే క్యూ న్యూస్ కార్యాలయంలపై పోలీసులు పలుసార్లు దాడులు చేశారు. కార్యాలయంలో ఉన్న హర్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు. దీంతో బీజేపీ నేతలతో పాటు తీన్మార్ మల్లన్న అభిమానులు సిబ్బంది పలుసార్లు ఆందోళన సైతం నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ నేతలు తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతు ప్రకటించారు. వ్యక్తిగత పోరాటం కన్నా జాతీయ పార్టీ అండతో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయాలనే లక్ష్యంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. అంతకు ముందు ఈటల రాజేందర్ సైతం అక్రమ కేసుల నేపథ్యంలోనే ఆ పార్టీలోకి చేరారనే ప్రచారం కూడా కొనసాగింది.
అయితే బీజేపీలోకి తీన్మార్ మల్లన్న చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారా లేదా.. తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ విధానాలు ఎండగడతారా వేచి చూడాలి. ఇక ఆయన గతంలో కూడా కాంగ్రేస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా కూడా పోటి చేయగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటి చేసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో హోరాహోరి పోరాడారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడడంతో పాటు ప్రభుత్వ విధానాలను ఆయన చానల్ ద్వారా ఎండగట్టాడు.