డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
తెలంగాణ రాజకీయాల్లో ఇన్నాళ్ళు అణిగిమనిగిన అనేక గొంతులు కొత్త సమీకరణ సభలతో పెగులుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల అలజడిలో కొత్త కొత్త సమీకరణలు, కేసియార్ నియంతృత్వ పోకడలను ప్రశ్నించడం మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు గ్రామీణ నేపద్యంలో అట్టడుగు వర్గాల నుండి వచ్చిన విద్యార్ధులకు నైతిక ధైర్యం ఇస్తూ, నైపుణ్యం, శిక్షణ కలగలసిన విజయాలను ఇచ్చిన ఐపియస్ ఆఫీసర్ ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ కృషిని అభినందిస్తూ జ్ఞానయాత్ర ఆలంపూర్‌లో ప్రారంభమయినప్పుడు నేను పాల్గొనడం కూడా జరిగింది.
తెలంగాణలో ఆధిపత్య వర్గాల పెత్తనం, మిగతా వర్గాలపై వివక్ష ఉన్నతాధికార, ముఖ్యమంత్రి అంతరంగిక సిబ్బందితో కొనసాగుతుందని వి.కె సింగ్, ఆకూనూరి మురళీతో పాటు ఆర్.యస్ ప్రవీన్‌కుమార్ వాఖ్యలతో స్పష్టమయ్యింది. అయినా యస్.సి సబ్ ప్లాన్, ఇతర అభివృద్ది పథకాలను తుంగలో తొక్కి దళిత బంధుతో చిందులేస్తున్న ముఖ్యమంత్రిని అభినవ అంబేడ్కర్
గా అభివర్ణించే వందిమాగదుల మద్య ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార రాజకీయాల కోసం బహెన్‌జీ మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో ఆగస్టు 8న నల్లగొండలో చేరి వేలాది మందితో సభ జరుపుతామన్న ప్రయత్నాన్ని తెలంగాణ ఇంటి పార్టీ ఆహ్వానిస్తుంది.
ఎన్నో అణచివేతల, హత్యాకాండల యెడల తమ విచారాన్ని వ్యక్తం చేసిన జాతీయ కాంగ్రెస్ ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన హక్కుల శంఖారావానికై ఆగస్టు 9న సభ జరుపుతున్నది. పోడు వ్యవసాయంపై కేసియార్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను క్షేత్ర స్థాయిలో ఎదిరిస్తూ, కార్యాచరణ ప్రకటించిన కాంగ్రెస్, ఆదివాసి అమాయక ప్రజలపై చెరగని నెత్తుటి మరక, ఆధునిక భారత చరిత్రలో జలియన్ వాలా బాగ్
కొనసాగింపు ఇంద్రవెల్లి తీరు సంఘటనలు తాము అధికారంలోకి వస్తే పునారావృతం కాదని హామి ఇవ్వవలసి ఉన్నది. ఏ కారణం చేత ఇంద్రవెల్లిలోనే సభ పెట్టాలని నిర్వహించినా, ఆ సభకు పౌర సమాజం ఆమోదం కేవలం నాటి హత్యాకాండకు బహిరంగ విచారం ద్వారా, తమ పాలనలో ఎప్పటికి పునారావృతం కాదనే హామీ ద్వారనే సాద్యమవుతుంది. బియస్‌పి, కాంగ్రెస్ రెండు సభలకు కేసియార్ ప్రభుత్వం ఆటంకం కలిగించవద్దని, సభలు విజయవంతం కావాలని తెలంగాణ ఇంటి పార్టీ ఆకాంక్షిస్తున్నది.