గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
లడ్డూ కల్తీపై నిలదీత:
తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) నివేదికలో స్పష్టమైందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. “బహిరంగ మార్కెట్లో బటర్ ధర కిలో రూ. 460 పలుకుతుంటే, కేవలం రూ. 319కే నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ ధరకే నాసిరకం నెయ్యిని సేకరించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.
సంగం డెయిరీపై ఆరోపణల తిప్పికొట్టడం:
వైష్ణవి డెయిరీ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ధూళిపాళ్ల కొట్టిపారేశారు. రాత్రికి రాత్రే రంగులు వేయడం, వెబ్‌సైట్లు డౌన్ చేయడం వంటి ‘ఫేక్’ రాజకీయాలు చేయడం వైసీపీకే సాధ్యమని ఎద్దేవా చేశారు.
* అక్రమ కేసులు: గత ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేసేందుకే తనను 33 రోజులు అక్రమంగా జైలులో పెట్టారని ఆరోపించారు.
* నాణ్యతకు నిదర్శనం: అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, ఇది గుంటూరు రైతుల సొత్తని ఆయన గర్వంగా ప్రకటించారు.
వైసీపీ అవినీతిపై ధ్వజం:
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాకు రూ. 307 కోట్ల ప్రకటనలు ఇచ్చిందని, భారతీ సిమెంట్స్ ద్వారా లక్షలాది టన్నుల సిమెంట్ కొనుగోలు చేసిందని ధూళిపాళ్ల ఆరోపించారు. తనపై పెట్టిన 22 అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే సమీక్షించి ఎత్తివేయాలని ఆయన కోరారు.
“రాజధాని విషయంలో ఆరోపణలు చేసినప్పుడే చెప్పాను.. మీరు ఏమీ పీకలేరని. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. కాంగ్రెస్, వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నడూ భయపడలేదు.” — ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ ఎమ్మెల్యే