మహిళా ప్రొడక్షన్ యూనియన్‌లో ముసలం – అధ్యక్షురాలు లలితపై సభ్యుల పోలీస్ ఫిర్యాదు

Entertainment Latest News

▪️ ‘లెక్కలు అడిగితే సస్పెన్షన్లు.. కేసుల పేరుతో బెదిరింపులు’
▪️ ‘పదేళ్ల ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు బయటపెట్టాలి’
▪️ ‘పనులు ఇవ్వొద్దంటూ ప్రొడక్షన్ మేనేజర్లపై ఒత్తిడి’
▪️ వివాదానికి తెరదించేందుకు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని డిమాండ్

హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు మహిళా సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో తమ ఆవేదనను వెల్లడించారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలపై లెక్కలు అడిగితే తమను అవమానిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, కమిటీ ఆమోదం లేకుండానే సస్పెన్షన్లు విధిస్తున్నారని వారు ఆరోపించారు.

‘మా డబ్బుకు లెక్క చెప్పాలి’ — గత పదేళ్లుగా యూనియన్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ-వ్యయ వివరాలు, సభ్యుల నుంచి వసూలు చేస్తున్న చందాలు, ఇతర నిధుల వినియోగంపై పూర్తి వివరాలను సభ్యుల ముందుంచాలని వారు డిమాండ్ చేశారు. యూనియన్ ఆస్తులు, స్థలం కొనుగోలు తదితర అంశాల్లోనూ పారదర్శకత ఉండాలని కోరారు.

‘ప్రశ్నిస్తే అవమానాలు.. సస్పెన్షన్లు’ — అధ్యక్షురాలు తనకు నచ్చని సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఏ సభ్యుడైనా తప్పు చేస్తే కమిటీతో చర్చించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ అధ్యక్షురాలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.

‘ఉపాధిని దెబ్బతీస్తున్నారు’ — తమను ప్రశ్నించినందుకు కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ చీఫ్‌లకు ఫోన్లు చేసి పనులు ఇవ్వొద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని మహిళా కార్మికులు ఆరోపించారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున యూనియన్‌కు చందా చెల్లిస్తున్నామని, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని సభ్యులు తెలిపారు. “మేము కష్టపడి సంపాదించిన డబ్బుకు లెక్క అడుగుతున్నాం. అందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం, పనులు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.

యూనియన్‌లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, చిత్ర పరిశ్రమ పెద్దలు వెంటనే జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకత కల్పించడంతో పాటు సభ్యుల మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, తమ ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *