స్వామి ముద్దం
PRIME TODAY
ఎడిటోరియల్
తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు ఆ అడవిపై హక్కు కోసం ఎదురు చూస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పోడుభూములపై పాడు దందా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో భూముల అంశం కూడా ఉంది. తెలంగాణలో భూ చట్టాలు అమలు అవుతాయని, పోడు భూములపై పట్టా హక్కు పొందాలని పోడు సాగుదారులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు గడిచినా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’అన్న చందంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తున్న అమాయక గిరిజనులను అష్టకష్టాలపాలు చేస్తున్నారు. పోడు రైతులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దీంతో తెలంగాణ పాలక పక్షతీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు ఉద్యమానికి దిగాయి.
దున్నేవాడిదే భూమి అని గిరిజనులు.. హక్కులు లేనిదే అడుగు పెట్టనీయమని అటవీశాఖ.. పోడు భూముల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని ప్రభుత్వం.. ఇలా అటవీ ప్రాంతాల్లోని భూములకు హక్కుల చిక్కులు తేలకుండా ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతోంది. పలు జిల్లాల్లో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఏటా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
అటవీ, పోడు భూములపై హక్కుల కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాల తర్వాత 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అంతకు ముందు అటవీ భూములను సాగుచేసుకుంటున్న వారికి ఈ చట్టం ప్రకారం హక్కులు కల్పించాల్సి ఉండగా నాటి ఉమ్మడి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయ్. అడవుల్లోనూ, కొండ వాలుల్లోనూ చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయమని ఆదివాసీలు పిలుస్తారు. సాంప్రదాయ బద్దంగా చేసుకునే ఇటువంటి వ్యవసాయంపై తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయ్. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుదారులను గుర్తించి సబ్‌డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు పంపాల్సి ఉంది. ఈ కమిటీల్లో నిర్ణయించిన విధంగా పట్టాలు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కట్టబెట్టింది. అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు ఇచ్చే విషయంలో అటవీ శాఖ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది.
ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అటవీ హక్కుల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందాయి అప్పట్లో. వీటి ప్రకారం 19.66 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్సించాల్సి ఉంది. అదెంత వరకు అమలైందో అధికారులకే తెలియాలి. సామూహిక హక్కులతో కేవలం ఫల సాయంలో కొంత అనుభవించే అధికారం ప్రజలకు ఉంటుందే తప్ప యాజమాన్య హక్కులు, అధికారాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీని వల్ల ఆదివాసీ కుటుంబాలకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు హక్కులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం అది చేయకపోగా హరితహారం పేరుతో భూములను స్వాధీనం చేసుకోవటంపై చర్చ జరుగుతోందిప్పుడు. ఈ పరిస్థితుల్లోనే కొందరు అటవీ పోలీస్ అధికారులు ఆదివాసీల పట్ల దురుసుగా ప్రవర్తించటం, అక్రమ కేసులు పెట్టడంతో గిరిజన ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయ్. పోడు భూముల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి ఇంకా అధికారిక ఉత్తర్వులు కానీ కొత్త మార్గదర్శకాలు కానీ విడుదల కాకపోవడంపై మండిపడుతున్నాయ్.
పోడు భూముల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. రాజకీయం జోక్యంతో సమస్యకు మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. పోడు భూముల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. కాగజ్‌నగర్ ఘటన సమస్య తీవ్రతకు పరాకాష్టగా నిలుస్తుండగా ఖమ్మం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికి ఆ భూములపై హక్కును కల్పిస్తే ఈ సమస్యకు అవకాశమే ఉండేది కాదు. తక్షణమే కేసీఆర్ సర్కార్ ఈ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించకుండా తాత్సారం చేస్తే పరిస్థితులు మరింతా కఠినంగా మారుతాయి.