హైదరాబాద్ (రవీంధ్రభారతీ): తెలంగాణ ఎన్నారై, రచయిత నక్షత్రం వేణుగోపాల్ రాసిన ‘అరుగు’ కథల పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య రక్షణ కోసం జంట నగరాల కవులకు అందిస్తున్న ప్రోత్సాహం పట్ల.. కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కథలు రాసే రచయితలు చాలా అరుదుగా ఉన్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు డాక్టర్ నందినీ సిధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రచయితల సంఘం, అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత నక్షత్రం వేణుగోపాల్ రాసిన “అరుగు” కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ సాహిత్యానికి ఒక మార్గం చూపడానికి జంట నగరాల కవులకు అందిస్తున్న ప్రోత్సాహం పట్ల పలువురు వక్తలు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కూడా మంచి అద్భుతమైన కథలు వచ్చాయని.. తానూ రాశానని గట్టిగా గర్వంగా చెప్పగలిగే రచయిత నక్షత్రం వేణుగోపాల్ అని సిధారెడ్డి కొనియాడారు. 1991లో “పర్యవసానం” పేరిట రాసిన ఓ కథ అప్పట్లో మంచి ప్రాచుర్యం పొందిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, డాక్టర్ పసునూరి రవీందర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయితలు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్, కొండపల్లి నీహారిణి, దేవనపల్లి వీణావాణి తదితరులు పాల్గొన్నారు.