నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను లేవనెత్తారు.
డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు?
దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన సమయంలో నోరు మెదపని గణేష్‌కు, ఇప్పుడు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నాయకులు ధ్వజమెత్తారు. “స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సుధాకర్‌ను చంపారు” అని కావేరి బాయి చేసిన సంచలన వ్యాఖ్యలపై గణేష్ ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నించారు. ఆనాడు దళితులకు అన్యాయం జరుగుతుంటే అండగా నిలవని వారు, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దళితులను వాడుకోవడం సరికాదని హితవు పలికారు.
అయ్యన్నపాత్రుడి కృషితోనే న్యాయం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని దళిత నాయకులు గుర్తుచేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంలో అయ్యన్నపాత్రుడు కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు.
భూముల ఆక్రమణపై నిలదీత
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో దళితుల భూములను లాక్కున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని నాయకులు ప్రశ్నించారు.
దళితుల భూముల్లో సచివాలయాలు నిర్మిస్తుంటే గణేష్ ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.
ఆనాడు అయ్యన్నపాత్రుడు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి దళితుల భూములను రక్షించేందుకు పోరాటం చేశారని వారు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై స్పందిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మానుకోవాలని గణేష్‌కు నాయకులు హెచ్చరిక జారీ చేశారు. గతంలో దళితులకు చేసిన అన్యాయాలపై పశ్చాత్తాపం ప్రకటించి, వెంటనే క్షమాపణ చెప్పాలని వారు స్పష్టం చేశారు. దళితుల హక్కుల విషయంలో రాజకీయం చేయకుండా నిజాయితీగా వ్యవహరించాలని వారు సూచించారు.