అమరావతి (Prime Today): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” ను మార్చి 16న ఘనంగా ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు.
తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో నిర్మించారు. రాజధాని అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్లో ఈ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన స్మృతి వనంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శంకుస్థాపన జరిగిన కేవలం ఆరు నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలందరూ హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డూండి రాకేశ్ కోరారు.
తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా అమరావతిలో ప్రతిష్ఠించిన “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.