షాకింగ్ సర్వే: ప్రజాగ్రహంలో కేసీఆర్ నెం. 1

Latest News Political News

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల పోరు తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగానే ఉంది. తాజాగా విడుదలైన ఒక సర్వే సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిపాలన సూచీ మీద ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ సర్వే నిర్వహించి విడుద‌ల చేసింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందన్న అంశం మీద సర్వే నిర్వహించారు. దీని ఫలితాలు షాకింగ్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేదన్న మాటను పదే పదే చెప్పుకునే గులాబీ దళానికి దిమ్మ తిరిగిపోయేలా సర్వే ఫలితాలు ఉన్నాయి. దేశంలో అత్యంత ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిలిచారు. ఆయన ఈ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. అంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తేట‌తెల్లం అయింది.

ఇదిలా ఉంటే.. ఏపీ విషయానికి వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి మీద కాకుండా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల పని తీరు మీద ప్రశ్నించగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రజాగ్రహం స్పష్టమైంది. 28.5 శాతం మంది ప్రజలు తమ ఎమ్మెల్యేల మీద ఆగ్రహంతో ఉన్నట్లుగా సర్వేలో పాల్గొన్నవారు స్పష్టం చేశారు. ఆ తర్వాతి స్థానంలో గోవా ఎమ్మెల్యేలు నిలవగా.. తర్వాతి స్థానం తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక.. రాష్ట్ర ఎమ్మెల్యేల మీద సానుకూలత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే కేరళ ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజాగా విడుదలైన సర్వేలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉన్న వ్యతిరేకత.. సానుకూలతను చూసినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 30.3శాతం మంది కేసీఆర్ ను వ్యతిరేకించినట్లుగా తేల్చారు. కేసీఆర్ తర్వాతి స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిలిచారు. యూపీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లోకి వచ్చిన వేళ.. వెలువడిన ఈ సర్వే ఫలితం కమలనాథుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. మూడోస్థానంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. మెరుగైన ప్రజామోదం ఉన్న ముఖ్యమంత్రుల్లో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిభూపేశ్ సింగ్ బఘేల్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన మీద సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం ఆరు శాతం మంది మాత్రమే నెగిటివ్ గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *