సోషల్ మీడియా విస్తృతి ఎంతలా పెరుగుగుతందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ శరవేగంగా దూసుకుపోతున్న సోషల్ మీడియా సమాజంలో ఎన్నో మార్పులకు తెర తీస్తోంది. చివరికి రాజకీయాలను సైతం శాసించే స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇక భారతీయ జనతాపార్టీ సైతం సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వర్క్‌షాప్‌లను సైతం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ఇంచార్జుల జాతీయ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఉపయోగించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ పథకాలతో పాటు పార్టీ కార్యక్రమాలను అందరిలోకి తీసుకెళ్లాలని పిలుపినిచ్చారు. ఇందులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపిన ఆమె.. విద్యనభ్యసించని వారు కూడా సోషల్ మీడియాను వాడుతున్నారన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా తెలపాలని అరుణ పిలుపునిచ్చారు.
నేను అందుకే ఓడిపోయాను..
తాను 2019లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘నేను బీజేపీలో చేరేకంటే ముందు కాంగ్రెస్‌లో ఉన్నాను. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రి సేవలందించాను. 2019 ఎన్నికల ముందు బీజేపీలో చేరాను. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం, సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతోనే నేను ఓడిపోయాను. అంతేకాకుండా నేను పార్టీ మారిన విషయాన్ని ప్రజలకు చెప్పలేకపోయాను. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.