వరంగల్ (ప్రైమ్ టుడే ప్రతినిధి): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు.
మిగిలిన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. ఇటీవల ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో చారిత్రక కట్టడాలకు పేరున్న తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ స్థాయిలో ఈ రకమైన గుర్తింపు సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప చరిత్ర సృష్టించింది.