కరీంనగర్: టీఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముసలం రేపాయి. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాల్లో ఒక్కసారిగా దాదాపు 18 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు వచ్చినా.. తమ అవకాశం రాకపోవడంతో ఆశలు పెట్టుకుని భంగపడిన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచందర్‌రావు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామాలు ప్రకటించారు. ‘‘మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యాను. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు” అంటూ గట్టు రామచందర్‌రావు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు చేసిన రవీందర్ సింగ్
రాజీనామా లేఖలో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటైన పదాలతో రవీందర్ సింగ్ రాజీనామా లేఖ రాశారు. తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని రాజీనామా లేఖలో ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ పదవులు కట్టబెట్టారని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సందర్భాల్లో ఉద్యమకారులను అవమానించి, ఉద్యమ ద్రోహులను అందలమెక్కించారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చామని రవీందర్ సింగ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి విషయాలన్నీ చెబుదామంటే కేసీఆర్ కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తూ, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘అధికారం రాకముందు మీరు ఉద్యమకారులను ఎలా గౌరవించేవారో.. అధికారం వచ్చాక వారి పరిస్థితి ఏమిటో ఓసారి గుర్తు చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇంతవరకు ఆదరించిన మీకు ధన్యవాదాలు’’ అంటూ రవీందర్ సింగ్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.