‘కిన్నెర మొగిల‌య్య’ ఎవ‌రో తెలుసా!

Latest News Viral News

తెలంగాణ మ‌ట్టిత‌న‌పు చైత‌న్యాన్ని పొందిన క‌ళాకారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కేవ‌లం కిన్నెర వాయిద్యంతో ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసిన అరుదైన క‌ళాకారుడు మొగుల‌య్య‌. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. పన్నెండు మెట్ల కిన్నెర అదో అరుదైన వాద్యం. దాన్ని పలికించే కళాకారులు కనుమరుగయ్యారు. మొగులయ్య ప్రతిభ భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది తెలంగాణ ప్ర‌భుత్వం.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన మొగులయ్య.. తండ్రి ఏడు మెట్ల కిన్నెరతో ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టేలా జానపదాలను రూపొందించుకుని కిన్నెరపై పాడేవాడు. తండ్రి మరణానంతరం మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందుకున్నాడు. తండ్రి వాయించిన ఏడు మెట్ల కిన్నెర స్థానంలో సొంత ఆలోచనతో మూడు ఆనపకాయ బుర్రలను వెదురుబొంగుకు బిగించి 12 మెట్ల కిన్నెర తయారు చేసుకుని పాటలు పాడటం మొదలుపెట్టాడు. గ్రామాల్లో వీధివీధి తిరుగుతూ కళను బతికిస్తూ తన బతుకు వెళ్లదీసుకుంటున్నాడు.

ప్ర‌భుత్వం ఎంత గుర్తింపు ఇచ్చి స‌త్క‌రించినా ఆయ‌న‌ పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌లేక‌పోయింది. ఆసరా పింఛను అడిగితే వయసు చాలదన్నారు. మొగులయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. మూడో కుమారుడు పదోతరగతి చదువుతుండగా, రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి నెలకు 4 వేల వరకూ ఖర్చవుతోంది. మొన్నటివరకు అక్కడక్కడా వాయిద్య ప్రదర్శనలతో పొట్టపోసుకున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది. ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమైంది. దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక ఆయన నలుగురినీ యాచించాల్సిన స్థితికి వ‌చ్చేశారు. పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించారు ఒక స‌మ‌యంలో. పొట్టకూటి కోసం మట్టి పనిచేసినా, అడ్డా కూలీగా మారినా ఏ రోజూ కిన్నెరను పక్కన పెట్టలేదు. అరవై ఏళ్ల నుంచి ‘కిన్నెర’ పాటలు పాడుతూ బతుకుతున్న మొగిల‌య్య‌ను ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న క‌ళ‌కు మ‌రింతా గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదీఏమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాలో ఈ అరుదైన క‌ళాకారుడికి అవ‌కాశం ఇవ్వడం సంతోష‌క‌ర‌మనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *