నిన్న బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు.. ఆయనతో కీలక సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీలో ఆయన ఏయే అంశాల గురించి పార్టీ నేతలో మాట్లాడారనే దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే సీఎం కేసీఆర్.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ఏ రకమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా కేసీఆర్ తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే అంశంపై బీజేపీ హైకమాండ్‌కు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారని టాక్. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని.. కాబట్టి అందుకు తగ్గట్టుగా పార్టీ సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని చాలా నెలల క్రితమే జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చాలాసార్లు వ్యాఖ్యానించారు.
షెడ్యూల్ కంటే ఏడాది ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి అంచనా వేశారు. తాజాగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా సైతం తమ పార్టీ నేతలకు ఇదే రకమైన విషయం చెప్పడంతో… కేసీఆర్ ముందస్తు వ్యూహంపై రాజకీయ పార్టీలు అలర్ట్‌గా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా కేసీఆర్ వ్యూహాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా గుజరాత్‌పై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఫోకస్ అంతా గుజరాత్ మీదే ఉండే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సందర్భాన్ని ఎంచుకుని ఉంటారనే భావనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే తమకు అధికారం వచ్చే ఛాన్స్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం, ముఖ్యంగా అమిత్ షా ఉన్నారని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే ఆయన ముందుగానే తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని అంటున్నారు.