Review: ‘Government Junior College Punganur-500143’

Entertainment

నటీనటులు: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం – బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్, రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్, ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, పాటలు: కార్తీక్ రోడ్రిగజ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్

యూత్‌ను మెప్పించే కంటెంట్ ఉంటే సినిమాను హిట్టు చేస్తారు ఈ త‌రం ప్రేక్ష‌కులు. తాజాగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా తెర‌కెక్కించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెర‌కెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాత. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
2004 సంవ‌త్స‌రంలో రాయ‌ల‌సీమ‌లోని పుంగనూరు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో చ‌దువుతాడు పేద కుటుంబానికి చెందిన కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతం). తల్లి కూలి పనులు చేస్తూ వాసును చదివిస్తుంటుంది. అతని తండ్రి తాగుబోతు. వాసుకు ఇద్దరు స్నేహితులు ఉంటారు. కాలేజ్ లో కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) అంటే అబ్బాయిలకు పిచ్చి క్రేజ్. ప్రతి కుర్రాడు కుమారితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. ఒక రోజు వాసు కుమారిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆమె ప్రేమలో పడిపోతాడు. వీళ్ల స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. తొలి ప్రేమ అనుభూతులను ఈ జంట ఎంజాయ్ చేస్తుంటారు. కుమారి కోసం ఇంట్లో డబ్బులు తెచ్చి బైక్ కొంటాడు వాసు. కొన్ని సంఘటనల వల్ల వీరి మధ్య అపార్థాలు ఏర్పడతాయి. దాంతో ఊహించ‌ని సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. ఇంత‌కి కుమారి నిజంగానే వేరే అబ్బాయిని ప్రేమించిందా? వాసు కుటుంబంలో జరిగిన ఘటనలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
లేలేత వ‌య‌సులోనే ప్రేమ‌లో ప‌డ‌టం, తొలి ప్రేమ అనేవి చాలా మంది జీవితంలో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాలుగా ఉంటాయి. స‌రిగ్గా అలాంటి ఫీల్ ఉన్న చిత్రం ఇది. హీరో హీరోయిన్ల పాత్రల పరిచయాలు, ఊరి ఆహ్లాదకర పరిసరాలు, కాలేజ్ లో స్నేహితులతో వాసు చేసే కామెడీ.. ఇలా సరదాగా సినిమా మొదలై సాగుతుంటుంది. కుమారి ఎంట్రీతో వాసు లవ్ స్టోరీ మొదలవుతుంది. ఈ లవ్ స్టోరీ క్యూట్ ఫీలింగ్ కలిగిస్తుంది. వాసు ఇద్దరు స్నేహితులు, కుమారి, ఆమె స్నేహితురాలి మధ్య వచ్చే కాలేజ్ సీన్స్ బాగున్నాయి. వాసు, కుమారి లవ్ మొదలయ్యాక ఈ జంట మధ్యే ప్లెజెంట్ గా సీన్స్ వెళ్తుంటాయి. మరోవైపు వాసు కుటుంబ పరిస్థితిని, కుమారి కుటుంబ పరిస్థితిని పరిచయం చేస్తాడు దర్శకుడు. వీళ్లిద్దరి కుటుంబాలు భిన్నమైన నేపథ్యంతో ఉంటాయి. ఆ బ్యాక్ గ్రౌండ్ కూడా ఎంతో స‌హ‌జంగా చిత్రించాడు డైరెక్ట‌ర్.

టీనేజ్ ప్రేమ‌లో రొమాన్స్ సీన్ల‌కు అవ‌కాశం ఉన్నా కూడా దర్శకుడు శ్రీనాథ్ పులకురం సకుటుంబంతో కలిసి సినిమా చూసేలా హుందాగా తెరకెక్కించాడు. ఎక్కడా హద్దులు దాటించ‌లేదు. ఒక ప్ర‌తిభావంతుడైన దర్శకుడికి ఉండే లక్షణం ఇది. కుమారి వాసు మధ్య అపార్థానికి దారి తీసే సన్నివేశాలు కన్విన్సింగ్ గా ఉన్నాయి. ఈ కథలో ప్రత్యేకంగా విలన్స్ ఎవరూ ఉండరు. విలన్ ఎవరు అనేది తెలిశాక అవాక్క‌వుతారు. యువత జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని చెప్ప‌డంలో దర్శకుడు శ్రీనాథ్ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ, రామ్ పటాస్..ఇలా కాస్టింగ్ అంతా పర్ ఫెక్ట్ గా పర్ ఫార్మ్ చేశారు. యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′పేరు తెచ్చుకుంటుందని చెప్పవచ్చు.

క్వాలిటీ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. తొలి ప్రయత్నంలోనే నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి ఒక మంచి సినిమా రూపొందించాడు. ఓ చిన్న పాత్రలో ఆయన నటించాడు కూడా. పాటలు బాగున్నాయి. కార్తీక్ రోడ్రిగజ్ పాటలు హార్ట్ టచింగ్ గా కంపోజ్ చేశాడు.  నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా కామెడీ, ట్రాజెడీ, లవ్ ఎలిమెంట్స్, క్యూట్ రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్స్ అన్నీ స‌రిగ్గా కుదిరాయి. ఈ వీకెండ్‌లో త‌ప్ప‌క చూడాల్సిన సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *