గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. రాజధానిలో చెరువులు, కుంటలు, పార్కు స్థలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేసింది. గత 20 రోజుల్లో 18 చోట్ల చేపట్టిన కూల్చివేతల్లో 166 నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ సహా పలవుర మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖుల కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.
అయితే ఈ హైడ్రా కూల్చివేతలను అధికార కాంగ్రెస్ నేతలు సమర్థిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు నిర్మాణాలను కూల్చేసి ఆ తర్వాత చేతులెత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ సవాల్ విసిరింది. హైడ్రా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తే ఓ మూడు కట్టడాలను కూల్చేయాలని సవాల్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆక్రమణలకు సబంధించిన వివరాలు ఉంచింది.
1) బండ్లగూడలోని సలకం చెరువును ఆక్రమించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా ఓవైసీ మహిళా కాలేజీ నిర్మించారని వాటిని కూల్చాలన్నారు. 2) హైదరాబాద్ శివారు జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లుగా చెబుతున్న ఫాంహౌస్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలు కూల్చాలన్నారు. 3)కాంగ్రెస్ నేతల చెందిన ఫామ్‌హౌస్‌లు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ గూగుల్ ఎర్త్ మ్యాప్‌ను పోస్టు చేసి ఈ కట్టడాలను కూల్చాలన్నారు.
ఈ మూడు కట్టడాలను కూల్చటం ద్వారా హైడ్రా చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. అయితే బీజేపీ సవాల్‌కు ప్రభుత్వం, హైడ్రా ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. ఓవైసీ విద్యాసంస్థలు కూల్చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా.. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.