కేసీఆర్‌కు చెక్ పెట్టే ఆయుధం
కాంగ్రెస్‌లోకి ఉద్యమనేత చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ విలీనం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందా? ఉద్యమ నేతలను పార్టీలో చేర్చుకుంటూ.. కాంగ్రెస్ రాజకీయ అలజడి సృష్టించబోతోందా? తాజా పరిణమాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. తెలంగాణ పోరాటయోధుడు డాక్టర్ చెరుకు సుధాకర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్టు సమాచారం.
నిస్తేజంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు నూతనోత్సాహం నింపేందుకు ఆ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భారీ వ్యూహాలకు తెరలేపుతున్నారు. కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే బలమైన ఉద్యమకారులతోనే సాధ్యమవుతుందని గ్రహించిన రేవంత్.. అలాంటివారిని పార్టీలోకి చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. చెరకు సుధాకర్ చేరిక విషయమై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ సాధనలో చెరుకు సుధాకర్ కీలకంగా పనిచేశారు. పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపారు. ఉద్యమకారులు, బహుజనులతో కలిసి రాష్ట్రంలో పలు వేదికలను ఏర్పాటు చేస్తూ తాజా రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా ఉద్యమకారులతో విస్తృత సంబంధాలు కలిగి ఉండటమేగాక విద్యావంతుడైన సుధాకర్‌ను చేర్చుకోవాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత ఆయన. చెరుకు సుధాకర్‌తో పాటు, ఆయన భార్య లక్ష్మికి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. ఈ కుటుంబం కాంగ్రెస్‌లో చేరితే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఏర్పడుతుందన్న చర్చ జరుగుతోంది. డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక.. నెక్ట్స్ లెవల్ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ఆయన అనుచరులు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బిగ్ స్టెప్ ఇప్పుడు తెలంగాణ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది.