మావోయిస్టు RK స్థానాన్ని భర్తీ చేసేది అతడేనా..?

Latest News

మావోయిస్టు అగ్ర‌నేత‌, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణంతో కీలకమైన ఏఓబీ పరిధిలో ఓ పట్టున్న నేతను పార్టీ కోల్పోయింది. ఆర్కే మరణంతో మళ్లీ ఏవోబీలో సందిగ్ధత నెలకొంది. ఆర్కే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏవోబీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఈ అంశంపై పోలీసువర్గాలు కూడా ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి దండకారణ్యంతోపాటు ఏవోబీ కూడా కీలకమైనది. నల్లమల, దండకారణ్యం, జంగల్‌ మహాల్‌తో పోటీపడుతూ ఏఓబీ పరిధిలో మావోయిస్టు పార్టీ నిర్మాణం, విస్తరణ, దాడుల వ్యూహాలను ఆర్కే అమలు చేశారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఆర్కే మరణంతో ఏవోబీలో పార్టీపై తప్పక ప్రభావం ఉంటుందన్నది కొందరి అభిప్రాయం. దీన్ని కొంతయిన తగ్గించుకునేందుకు ఏవోబీ ఉద్యమంపై బాగా పట్టున్న వ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఆర్కే వారసుడిగా పలువురి పేర్లు వినవస్తున్నాయి.

ఆర్కే వారసుడిగా సుధాకర్‌తో పాటు గణేష్‌, పద్మక్కల పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1998 నుంచి ఆరేళ్లపాటు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన సుధాకర్‌కు కేంద్ర కమిటీ నుంచి ఏవోబీ పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారని తెలుస్తోంది. సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా సుధాకర్‌కు ఏవోబీలో అనువణువుపై చక్కని అవగాహన ఉంది. ఈ నేపధ్యంలో ఆర్కే స్థానాన్ని సుధాకర్‌తో భర్తీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఏవోబీ కమిటీకి గణేశ్‌ నాయకత్వం వహిస్తున్నారు. 2004లో ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో గణేశ్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. గణేశ్‌ కన్నా ముందు ఏవోబీకి పద్మక్క కార్యదర్శిగా వ్యవహరించారు. 2016లో రామ్‌గూడ ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో ఏవోబీ కార్యదర్శి పద్మక్కనే. అయితే, ఆ తర్వాత పద్మక్కను ఏవోబీ కమిటీ బాధ్యతల నుంచి తప్పించి గణేష్‌ను నియమించారు. మావోయిస్టు ఏరివేత వ్యవహారాలను సుదీర్ఘకాలం నుంచి పరిశీలిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే స్థాయి నాయకుడినే కేంద్ర కమిటీ తరపున ఏవోబీకి పంపిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.


	

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *