సాగు చట్టాలకు వ్యతిరేకంగా పట్టాలెక్కిన రైతులు.. రైల్​రోకోతో ఉద్యమం మరింత ఉధృతం

Latest News Political News

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత ఉధృతమైంది. యూపీలోని లఖీంపూర్‌ హింసాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టారు రైతులు. రైల్వేట్రాక్‌లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన రైల్​రోకోతో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖింపుర్​ ఖేరి ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐతే అజయ్​మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని అంటున్నాయి రైతు సంఘాలు. అందుకే అదే డిమాండ్‌తో రైల్​ రోకోకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. ఈ రైల్‌రోకో.సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

ఐతే రైల్​ రోకోలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు లక్నో పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే దేశద్రోహ చట్టం కింద కేసులు పెడతామని వార్నింగ్‌ ఇచ్చారు, ఈ మేరకు నగరంలో ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించారు. 144 సెక్షన్​ విధించారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ లఖింపుర్​ ఖేరీలో ఆందోళనలకు దిగిన రైతులపై మంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *