చరిత్ర సృష్టించిన ఆదివాసీల చదువుల తల్లి

Editorial Latest News Political News Viral News

తండ్రి ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కూడా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలోనే చదివారామె.. విద్యార్థి నేతగా ఉద్యమాలు చేస్తూనే.. లా చేశారు. చిన్న వయసులోనే న్యాయకళాశాల ప్రిన్సిపల్‌ అయి వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డు సాధించారు. తెలుగునాట ఇలా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగానూ ప్రత్యేకతని సాధించారు గుమ్మడి అనూరాధ.

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వ‌ర్క్)
అది బషీర్‌భాగ్‌ పీజీ న్యాయ కళాశాల. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు ఇప్పటిదాకా ప్రిన్సిపల్‌ ఎవరన్నది ఎవరికీ గుర్తులేదు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్దిరోజుల క్రితం ఒక మహిళ ఇక్కడ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతే ఒక్కసారిగా ఆ కాలేజి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకు.. ఏమిటి.. ఎలా అంటే పెద్ద కథే ఉంది మరి.

అది బషీర్‌భాగ్‌ పీజీ న్యాయ కళాశాల. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు ఇప్పటిదాకా ప్రిన్సిపల్‌ ఎవరన్నది ఎవరికీ గుర్తులేదు. పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్దిరోజుల క్రితం ఒక మహిళ ఇక్కడ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతే ఒక్కసారిగా ఆ కాలేజి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకు.. ఏమిటి.. ఎలా అంటే పెద్ద కథే ఉంది మరి. అక్కడ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టింది ఓ ఆదివాసీ మహిళ. తెలుగు రాష్ట్రాల్లో ఓ యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన తొలి ఆదివాసీ మహిళ. దాంతోనే ఈ విషయానికి అంత ప్రాధాన్యం.. అంతే కాదు.. ఆమె ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి.. ఇప్పుడు తన పొలంలో పనులు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు. ఆమె పేరు గుమ్మడి అనూరాధ. తాను పాతికేళ్ల పాటు చట్ట సభకు ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తెను అన్న విషయం ఆమె ఏనాడూ పట్టించుకోలేదు.

పైగా ఆమెకు తన ఇంటర్‌ చదివే రోజుల్లో తెలిసింది తన తండ్రి ఎమ్మెల్యే అని. ఆమె తండ్రి సింప్లిసిటీ, పేదల పక్షం వహించడం.. పోరాటాలకు ముందుండే తత్వం వెరసి ఆమెను ఓ ఉన్నత స్థాయికి చేర్చేలా చేశాయి. తొలి నుంచి సర్కారు బడుల్లోనే చదువుకున్న ఆమె తన సివిల్స్‌ సర్వీస్‌ కల నెరవేరకపోయినా నిరాశ పడలేదు. రెట్టింపు కసితో ఎల్‌ఎల్‌ఎం, అనంతరం పీహెచ్‌డీ చేశారు. తాను చదివిన యూనివర్శిటీలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించారు. అనంతరం తాజాగా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న బషీర్‌భాగ్‌ పీజీ లా కాలేజి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఒక్కసారిగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజాకవి జయరాజు మొదలు, ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్‌ హరిప్రియ ఇంకా పలువురు ప్రముఖులు ఆమెను కలిసి అభినందించారు.

ఎక్కడో మారుమూల ఆదివాసీ గిరిజన గూడెం నుంచి ఓ మామూలు మహిళ సాధించిన విజయం ఇప్పుడు బిగ్ టాపిక్‌గా మారింది. కమ్యూనిస్టు పార్టీ నుంచి ఐదు సార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య చిన్న కూతురు అనూరాధ చిన్ననాటి నుంచి యావరేజి స్టూడెంట్‌. ప్రాధమిక స్థాయి నుంచి సుదిమళ్ల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివారు. తన సొంతూరు టేకులగూడెం నుంచి చదువు కోసం అలా బయట అడుగుపెట్టిన అనూరాధ ఆదివాసీ హక్కుల కోసం నిత్యం తపిస్తూనే ఉంటారు. ‘ట్రైబల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఇన్‌ తెలంగాణ, స్పెషల్‌ రిఫరెన్స్‌ టు ఖమ్మం’ అనే అంశం పైన పీహెచ్‌డీ చేశారు. ఇలా పీహెచ్‌డీ చేస్తుండగానే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అనంతరం ఇప్పుడు బషీర్‌భాగ్‌ పీజీ లా కాలేజికి ప్రిన్సిపల్‌ అయ్యేలా చేసింది. పేదలకు సేవ చేయాలన్న తన చిన్ననాటి కల అయిన సివిల్స్‌ కోసం కోచింగ్‌కు వెళ్లినా ఎగ్జామ్‌ ప్యాట్రన్‌ చేంజ్‌ కావడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

అప్పటినుంచి తన తండ్రి కోరిక మేరకు లా విద్యార్థిగా మారారు. అక్కడే తన కెరీర్‌కు పునాది వేసుకున్నారామె. నాగరిక సమాజానికి దూరంగా పుట్టి పెరిగినా ఆమె ఏనాడూ తాను న్యూనతకు లోనుకాలేదు. తన తండ్రి ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ అభిజాత్యాన్ని సైతం తలకెక్కించుకోలేదు. పైపెచ్చు తన భవిష్యత్‌ను, జీవితంలో తాను ఏంచేయాలో దానికోసమే తన చదువును ఉపయోగించుకున్నారామె. కేవలం చదువులోనే కాకుండా ఆటల్లోనూ ప్రవేశం ఉన్న అనూరాధ వాలీబాల్‌ రాష్ట్ర స్థాయి టీంలో ఆడారు.

ఆదివాసీలకు రక్షిత నీటి సదుపాయాలు, సరైన పోషకాలు ఉండే తిండి, ఉండడానికి కనీస సదుపాయాలు లేని ఇళ్లు.. ఇలా ఎలాంటి సౌకర్యాలు లేని ఆదివాసీ గిరిజన గూడేల్లో జనం హక్కుల కోసం ఉద్యమించడం.. వారిలో చైతన్యం నింపడం అవసరం అన్నది అనూరాధ మాట. ఐదుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఇప్పటికీ పొలంలో పనిచేసుకుంటూ, పార్టీ పనుల కోసం జీపులోనే తిరిగే గుమ్మడి నర్సయ్య కూతురుగా ఆదివాసీ గిరిజనం హక్కుల కోసం పనిచేస్తునే ఉంటాను అంటారు అనూరాధ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *