PRIME TODAY
ప్రజలకు పెద్దపీట
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అధికారం కోసం అన్ని పార్టీలు ఉచిత పథకాల హామీలతో జనాలను ముంచెత్తుతాయి. అది ఉచితంగా ఇస్తాం.. ఇది ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను బుట్టలో వేసుకుంటాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటు ప్రజలు కట్టే పన్నులు.. అటు అప్పులు ఇవన్నీ ఉచిత పథకాలను అమలు చేయడానికి సరిపోతున్నాయి. ఇటు రాష్ట్రాల్లో.. అటు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. అసలు ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఎలాంటి వనరులు సృష్టించాలి? ఎలాంటి అవకాశాలు కల్పించాలనే ధ్యాస ఏ ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని ప్రతి వ్యక్తి పన్నుల రూపంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకు డబ్బు కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధన ధరల రూపంలో కావొచ్చు సెస్ జీఎస్టీ ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి మనిషి పన్ను కడుతూనే ఉన్నారు. చిరు ఉద్యోగుల నుంచి బడా వ్యాపార వేత్తల వరకూ.. చిన్న కిరాణా కొట్టు నుంచి ఎమ్ఎన్సీ కంపెనీల వరకూ ప్రతి ఒక్కరూ పన్ను చెల్లిస్తున్నారు. మరి ఈ పన్నులు చెల్లించేది ఎందుకు? అవి ఎందుకు ఉపయోగపడాలి? అంటే.. దేశంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం విద్య ఆరోగ్యం వసతి రహదారుల నిర్మాణం ఇలా ప్రజలు అభివృద్ది చెందాల్సిన పనుల కోసం ఈ పన్నుల ద్వారా వచ్చే డబ్బులు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇతర రూపంలో ప్రభుత్వాలు అప్పులు చేసేది కూడా ప్రజల సంక్షేమం కోసమే అని అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు.
ఇప్పుడు పన్నులు అప్పుల రూపంలో వచ్చే డబ్బంతా ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే అధికార ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బును ఓట్ల కోసం అధికారం కోసం స్థాయికి మించి అమలు చేసే ఉచిత పథకాల కోసం ఖర్చు పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అప్పులు తెచ్చి పెట్టి అదనపు భారం మోపుతున్నారు. అభివృద్ధి చేయకుండా మెరుగైన పరిపాలన ఇవ్వకుండా ఎంత సేపు అప్పులు పన్నులు ఆదాయం విషయాలపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. పరోక్షంగా ఓట్లను కొనేందుకే ఉచిత పథకాల అమలు చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం ఉచిత పథకాల రూపంలో ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా అందరూ కట్టిన పన్నుల నుంచి కొంతమందికే పంచడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నైపుణ్యాలు నేర్పించకుండా వనరులు సృష్టించకుండా అభివృద్ధి సాధించే అవకాశం ఇవ్వకుండా ఇలా నేరుగా డబ్బులు పంచితే ప్రయోజనం ఏముంటుందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలకు డబ్బులు చేరుతాయని ఎదురుచూసే దుస్థితి కల్పించిన పాలకుల తీరు పట్ల ప్రజలు అసంతృప్తి కనబరుస్తున్నారు. పాలకులంటే ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి తప్ప ఇలా ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడకూడదని ఈ విషయం ఈ నాయకులకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమోనని తీవ్రంగా మండిపడుతున్నారు.