హైదరాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వర్క్): ఈటల రాజేందర్ తన మనుషులతోనే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నానని అన్నారు. ఈటల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. . ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతి కోసమే అని ఆరోపించారు. ఓ మంత్రి తనపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన గంగుల కమలాకర్.. ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రాజకీయ హత్యలు, దాడులు ఉండవని అన్నారు. ఉంటే గింటే రాజకీయ ఆత్మహత్యలుంటాయని పరోక్షంగా ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఈటల రాజేందర్ మీద హత్యాయత్నం చేస్తే తన ప్రాణం అడ్డం పెట్టి కాపాడతా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయనతో రాజకీయ శత్రుత్వమే తప్ప వ్యక్తిగత శత్రుత్వం లేదని అన్నారు. ఈటల తనను ఎంతగా విమర్శించినా పట్టించుకోనని.. కానీ కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం ఊరుకోనని అన్నారు. తెలంగాణలో లేని సంస్కృతికి ఈటల రాజేందర్ తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గంగుల ఆరోపించారు.
ఓట్ల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా ? అని విమర్శించారు. ఈటల రాజేందర్ ఓడిపోతాడని ఆయనకు తెలిసిపోయిందని… అందుకే కొత్త డ్రామాకు ఆయన తెరతీశాడని అన్నారు. పవిత్రమైన దళిత బంధు కూడా రైతు బంధులాగా సక్సెస్ చేయాలని హుజురాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని అన్నారు. ఈ నిర్ణయం ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారని అన్నారు. ఈ ఎన్నికలకు దళితబంధు పథకానికి సంబంధం లేదని మంత్రి గంగుల అన్నారు.