ఏడు సంవత్సరాలుగా జవసత్వం లేని తెలంగాణ కాంగ్రెస్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి ఆ పార్టీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. గతం నుంచే తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అయిన తరువాత మరింత దూకుడు పెంచారు. సమయం దొరికనప్పుడల్లా టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు. సీనియర్లను కలుపుకుంటూ వెళ్తూ పార్టీ కోసం పని చేస్తున్నారు. అలాగే `దళిత, గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపుతున్నారు.
ఇంతకాలం తనకు ఎదురే లేదన్న రీతిలో ఉన్న టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించే పనిలో పడ్డారు రేవంత్. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొల్పారు. తాజాగా టీఆర్ఎస్ – బీజేపీ యేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి.. కేసీఆర్‌కు మరింత .. షాక్ ఇచ్చేలా.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ సర్కార్ విధానాలను ఎండగడుతూ జనంలోకి వెళ్తున్న రేవంత్.. విపక్ష పార్టీలను ఏకం చేయడంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రజాసమస్యలపై గళం విప్పే కమ్యూనిస్టులు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్ వంటి తెలంగాణలోని ముఖ్య నేతలతో అఖిల పక్షం సమావేశం నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు తమ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసు గాంధీభవన్ గత ఏడేళ్ల నుంచి స్థబ్దుగా ఉంది. తాజాగా రేవంత్ గాంధీభవన్‌కు పునర్‌వైభవం కనిపించేలా కళకళలాడుతోంది. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశంలో రాష్ట్రంతో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని రేవంత్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి తెలంగాణ ఇంటి పార్టీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు ఈ సమావేశంలో పాల్గొని రేవంత్ సారథ్యంలో ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.
ఐక్య కార్యాచరణతో కేసీఆర్ సర్కార్‌పై సమర శంఖం పూరించారు. భూ సమస్యలు భూ సేకరణ ధరణిలో లోపాలు పోడు భూములు సమస్యలపై కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని.. నిరంతరం ప్రజల్లో ఉండాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో కమ్యునిస్టు పార్టీలు అధికార టీఆర్ఎస్‌కు మద్దతుగా కనిపిస్తుండగా, తాజాగా సీన్ రివర్స్ చేశారు రేవంత్. అంటే కమ్యునిస్టులు కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారడంలో రేవంత్ చాకచక్యం ఇక్కడ బలంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్. మరోవైపు తెలంగాణలోని అన్ని ప్రజాసంఘాలను, విద్యార్థుల సంఘాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు రేవంత్. వీరితో కూడా తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ పరిణామాలు గమనిస్తే.. కేసీఆర్‌కు ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఒక ఎత్తయితే.. ఇకముందు జరగబోయేది మరో ఎత్తు అని చెప్పొచ్చు.