తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానన్న వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి దూకుడుగా ముందుకెళుతున్నారు. తన ప్రతి అడుగులోనూ దివంగత సీఎం వైఎస్ఆర్ ను చూపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో పక్కా సమైక్యవాది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లి అక్కడ ‘తెలంగాణ వస్తే ఆంధ్రులు పాస్ పోర్ట్ తీసుకోని వెళ్లాలని.. ఎట్టి పరిస్తితుల్లోనూ తెలంగాణ ఏర్పడవద్దని’ వైఎస్ ఘంఠాపథంగా చెప్పారు. దీంతో వైఎస్ఆర్ పచ్చి సమైక్యవాది అని.. ఆయన ఉంటే ఉమ్మడి ఆంధ్ర అస్సలు విడిపోయి ఉండేది కాదని.. వైఎస్ఆర్ ను పెట్టుకొని ఎలా రాజకీయం చేస్తావని షర్మిలను నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ రాజకీయవర్గాలు కూడా షర్మిలను డిఫెన్స్ లో పడేసేలా ఎత్తుగడ వేస్తున్నాయి. షర్మిల నెత్తిన పెట్టుకున్న ఆమె తండ్రి వైఎస్ఆర్ నే ఆయుధంగా తెలంగాణ పార్టీలు వాడుకుంటున్నాయి. వైఎస్ఆర్ గత చరిత్రను తవ్వి తీస్తూ ‘తెలంగాణ వ్యతిరేకి’ అన్న ముద్రను వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తన తండ్రి తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వేయడం సరైంది కాదని షర్మిల వాపోతున్న పరిస్థితి నెలకొంది. పైగా తాను తెలంగాణ బిడ్డనని కొత్త పల్లవిని షర్మిల అందుకున్నారు. ఈ గడ్డపైనే తాను పుట్టానని.. పెరిగానని.. ఈ ప్రాంత వాసినే పెళ్లి చేసుకున్నానని.. ఇక్కడే పిల్లలను కన్నట్టు షర్మిల చెబుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన తీన్మార్ మల్లన్న తాజాగా వైఎస్ షర్మిలపై పవర్ ఫుల్ పంచ్ విసిరారు. దీనికి ఆమె క్లీన్ బోల్డ్ అయిన పరిస్థితి నెలకొంది. ‘రాజన్న బిడ్డ షర్మిల.. తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటున్నారని.. మరి ఆమె ఓటర్ కార్డు ఆధార్ కార్డు పులివెందులలో ఎందుకు ఉన్నాయి?’ అని తీన్మాన్ మల్లన్న నిలదీయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాన్ని పట్టుకొని ఇప్పుడు షర్మిలను సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
షర్మిలను వ్యతిరేకించే తెలంగాణ వాదులకు పార్టీలకు ఇప్పుడు తీన్మార్ మల్లన్న కామెంట్స్ ఓ ఆయుధమై నిలుస్తున్నాయి. దీన్నేపట్టుకొని ఇప్పుడు షర్మిలను తెలంగాణలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.