తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనాన్ని.. ఆయన పెద్ద మనసును గొప్పగా చెప్పుకునే వేళ.. ఏపీని చిన్నబుచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ నీయాంశం గా మారాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఆయన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఏపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రా పాలకులు అల్లూరి కోసం ఏం చేశారోకానీ.. తాము అయితే ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసేవాళ్లమన్నారు. ఏపీలో పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయని హాట్ కామెంట్లు చేసిన ఆయన.. తెలంగాణలో అల్లూరి పుట్టి ఉంటే తమ ముఖ్యమంత్రి కేసీఆర్.. 24 ఎకరాల్లో అల్లూరి స్మ్రతి వనాన్ని ఏర్పాటు చేసి ఉండేవారన్నారు.
అల్లూరి దక్షిణాది వాడు అయి ఉండటం.. తెలుగువాడు కావటంతోనే సీతారామరాజుపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. పార్లమెంటులో ఆయన విగ్రహాం కూడా లేదని.. అందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలన్నారు. మంత్రి కేటీఆర్ తో మాట్లాడి.. కొంపల్లిలో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో రాజులతో తమ ప్రభుత్వానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రాజులది కీలక పాత్రగా అభివర్ణించారు. మొత్తంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు.. ఏపీ ప్రభుత్వాన్ని చిన్న బుచ్చేలా ఉందని.. అదే సమయం లో సీఎం కేసీఆర్ పెద్ద మనసును గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.