భారత రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమేనంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై రాజ్యసభలోనూ రగడ చోటుచేసుకుంది. కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారని రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త రాజ్యాంగం ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. అది ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు మద్దతివ్వడమేనని ఆయన ఆక్షేపించారు.
దేశానికి కొత్త రాజ్యాంగం విషయమై రాజ్యసభలో చర్చ సందర్భంగా స్వల్ప వాగ్వాదం జరిగింది. కేకే మాట్లాడుతూ బీజేపీ పాలనలో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని.. లౌకికతత్వం ప్రమాదంలో పడిందన్నారు. ఆర్ఎస్ఎస్, హిందూ అతివాద సంస్ధల విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలని ప్రతిపాదించారని కేకే అన్నారు. కేకే వ్యాఖ్యలపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ప్రతిపాదనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.