అధికారం చేతికి వచ్చినంతనే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. అధికారాన్ని చేపట్టి ఏడున్నరేళ్లు అవుతున్నప్పుడు మాత్రం కచ్ఛితంగా అంతో ఇంతో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పటికి ఏమీ చేయకపోగా.. ఎదురుదాడి చేస్తే మాత్రం దాన్ని ప్రశ్నించాల్సిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇదే రీతిలో ఉందని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత భట్టి విక్రమార్క సంధించిన పలు ప్రశ్నలకు బుల్ డోజ్ చేయటం ద్వారా.. గతాన్ని ఎత్తి చూపించటం ద్వారా అధిక్యతను ప్రదర్శించిన కేసీఆర్ వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పాలి.
హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ గురించి మాట్లాడిన సందర్భంలో.. విపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వర్షాలు వస్తే మనుషులు డ్రైనేజీల్లో కొట్టుకుపోతున్నారని మండిపడగా.. దానికి ఘాటుగా రియాక్టు అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దుస్థితికి కారణం మీరా? కాదా? మీరు డెవలప్ చేస్తే.. మేం చెడగొట్టామా? అంటూ తీవ్రంగా రియాక్టు అయ్యారు. ఇంతలా విరుచుకుపడిన కేసీఆర్.. తాము అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు అవుతుందని.. తమకూ బాధ్యత ఉంటుందన్న విషయాన్ని ఆయన మర్చిపోవటం సరికాదంటున్నారు.
ఏడున్నరేళ్ల తర్వాత కూడా ఇప్పుడే పవర్లోకి వచ్చినట్లుగా ఫైర్ కావటం సబబు కాదన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన ఎన్నేళ్ల వరకు విపక్షాలు నోరు మూసుకొని ఉండాలి? అన్నది ప్రశ్న. వర్షాలు వస్తే ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో పలువురు డ్రైనేజీలో కొట్టుకుపోవటం తెలిసిందే. ఈ ఉదంతాల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల బరితెగింపు అన్నది తెలిసిందే. జరుగుతున్న తప్పుల్ని ఒప్పుకుంటే.. కేసీఆర్ స్థాయికి బాగుండేది. అందుకు భిన్నంగా నోరు వేసుకొని పడిపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.