కాన్షీరామ్ బాట‌లో వెళితే బ‌హుజ‌న రాజ్యాధికారం సాధ్య‌మే

Editorial Political News

గర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన నిలువెత్తు రాజ‌కీయ శిఖ‌రం

తరతరాల బానిసత్వంలో మగ్గిపోయిన వారి మాటకు విలువ లేదు, తనువుకు తాహతు లేదు, అంతిమంగా బ‌తుకుకి భరోసా లేదు. మహాత్మా జ్యోతిబాఫూలే సామాజిక సమానత్వం, సామాజిక ప్రజాస్వామ్యం అను నినాదాలతో దళిత, బహుజన వర్గాలను సంఘటితం చేసి, విద్య ద్వారా జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం ద్వారా చైతన్యవంతులమై సమాజగతి తెలుసుకొని మన స్థితిని మార్చుకునే అవకాశం ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ‌హుజ‌నులకు భావోద్వేగం అయ్యాడు కాన్షీరామ్.

భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పి ఆధిపత్య కులాల పెత్తనాన్ని నిరోధించడానికి బహుజన కులాలను సమీకృతం చేసి పీడిత కులాలకు రాజ్యాధికార రుచిని చూపించినవాడు కాన్షీరామ్. రాజ్యాధికార సాధనకు చట్టం రూపం తీసుకువచ్చి మనుషులమన్న స్పృహ లేని మనలో ఉత్తేజితమైన మేధోపరమైన ప్రపంచస్థాయి ఆలోచనా విధానాన్ని అందిస్తూ తన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా జాతిని సంఘటితపరచి, చైతన్య వంతులను చేసి, రాజ్యాధికారమే ‘‘మాస్టర్‌ కీ’’ అని నినదించి, రాజ్యాధికార సాధన చక్రాలను మోసే బృహత్తర కార్యక్రమాన్ని మనకందించారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించి అందులో దళిత, బహుజన వర్గాల హక్కులకు చట్టాలను రూపొందించి, సూత్రాలను, ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. దాని ద్వారా దేశంలో మనకంటూ ఒక స్థితిని కల్పించారు. అయితే అంబేడ్కర్‌ తదనం తరం ఆయన ఆలోచనా విధానాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఆయన వంటి బలమైన మేధావి నాయకుడు లేక దళిత, బహుజన వర్గాల్లో మళ్లీ పిరికితనపు ఆలోచనలు వచ్చి రాజ్యాధికార సాధన చక్రాలను ఆపివేసారు. రాజకీయంగా భుక్తి కోసం, ఉనికి కోసం వివిధ పార్టీలకు చెంచాలుగా మారి, దళిత, బహుజన జాతి గౌరవాన్ని తాకట్టుపెట్టారు. కాని వాటన్నింటిని ఛేదించడానికి, అంబేడ్కర్‌ ఆలోచనా విధానానికి తన ఆచరణను కలిపి రాజ్యాధికారాన్ని సాధించాడు మాన్యశ్రీ కాన్షీరాం. ‘‘ఓట్లు మావి సీట్లు మీకా, ఇకపై చెల్లదు ఇకపై చెల్లదు’’ అనే నినాదంతో ఉత్తరప్రదేశ్‌ వేదికగా అగ్రకుల, బ్రహ్మణ వాద పెట్టుబడిదారీ ఆధిపత్య వర్గాలకు కాన్షీరాం సవాల్‌ విసిరాడు.

కాన్షీరాం ఒక గొప్ప వ్యూహకర్త. తన రాజకీయ వ్యూహాన్ని ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదట విజయవంతం చేశాడు. అంబేడ్కర్‌ చేసిన ఉద్యమాలను, ఆనాడు అగ్రకుల రాజకీయ పార్టీలను ఆయన ఎదుర్కొన్న తీరును తనలోకి ఒంపుకొని అంబేడ్కర్‌ రచనలు, ప్రసంగాల ద్వారా, ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పరచుకున్నాడు. బాబాసాహెబ్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ సిద్ధాంతాలనే బహుజన సమాజ్‌ పార్టీ మేనిఫెస్టోగా పెట్టుకొని కాన్షీరాం విజయవంతమయ్యాడు. అంబేడ్కర్‌ అన్నట్టు ‘‘ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ కలిసినా కలవకపోయినా ఓటు దగ్గర కలిస్తే అధికారంలోకి వస్తారు’’ అన్నదాని ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కాన్షీరాందే. అంబేడ్కర్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ చెంచాగిరిలో ముక్కలు చెక్కలవడంతో తీవ్ర మనస్థాపం చెందిన కాన్షీరాం అదే సిద్ధాంతంతో దళిత శోషిత సమాజ్‌ సంఘర్షణ సమితిని స్థాపించారు. అయితే దీనికి ముందే 1971లో తన సహచరులతో కలిసి ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన కులాలు మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. దీని ప్రధాన లక్ష్యం సాధారణ ఉద్యోగులకు ముఖ్యంగా తన సభ్యులైన ఉద్యోగులకు ఉన్నతాధికారులతో వచ్చే వేధింపులు, అన్యాయాలను ఎదుర్కొని న్యాయం చేయటం. 1973 నాటికే ఆయన అఖిల భారత వెనుకబడిన మైనారిటీ ఉద్యోగ సమాఖ్య బాంసెఫ్ ను స్థాపించారు. 1976 నాటికి ఢిల్లీలో కార్యాలయాన్ని తెరిచారు. 1978 డిసెంబర్‌ 6న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని నాడు అట్టహాసంగా ప్రారంభించారు. వీటి పునాదులపైనే బహుజన సమాజ్‌ పార్టీ ఆవిర్భవించి, ఉత్తరప్రదేశ్‌లో దళిత జాతి గర్వంగా తలెత్తుకు నిలబడింది.

రాజకీయాల్లో మాటలే ప్రజల్ని నడిపిస్తాయి. వాగ్దానాలే ఓటర్లను తమవైపు తిప్పుకుంటాయి. దానిని గ్రహించిన కాన్షీరాం తన మాటల తూటాలను నినాదాలుగా మార్చుకొని జననినాదాలుగా చేసుకొని ప్రజల నాలుకలపై అవలీలగా నాట్యమాడే విధంగా పామరుని సైతం కదిలించే విధంగా ప్రసంగించేవారు. ‘‘ఓట్లు మావి సీట్లు మీకా ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు’’, ‘‘నువ్వు 85 శాతం ఉండగా 15 శాతంపై ఎందుకు ఆధారపడతావు’’, ‘‘పార్లమెంట్‌కు నడువు, నీ కాళ్లపై నువ్వే నడువు’’, ‘‘జనాభాకు తగినంత వాటా’’ వంటి ఉత్తేజిత ఉద్వేగకర నినాదాలతో ప్రజల మనసులను దోచుకున్నరాయన. రాజ్యాధికారమే ‘‘మాస్టర్‌ కీ’’ అన్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో దళిత, బహుజన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు ఎన్నో విజయవంతంగా పూర్తి చేశారు.

అంబేడ్కర్‌ వారసుడిగా కాన్షీరాంకు రాజ్యాధికార సాధనలో అగ్రస్థానం కల్పించవచ్చు. అంబేడ్కర్‌ ఆలోచన విధానాన్ని, దానిలో అంతర్లీనంగా నిర్మితమైయున్న ఫూలే ఐడియాలజీని కలిపితేనే కాన్షీరాం మెథడాలజీ. ఇప్పటి వరకు ఎందరో మహనీయులు ఎన్నో ఉద్యమాలు చేసి దళిత, బహుజన వర్గాల్లో చైతన్యం రగిల్చి, రాజ్యాధికారం వైపు నడిపించారు. అంబేడ్కర్‌ అంతటి వాడు అగ్రకుల, బ్రహ్మణవాద రాజకీయాలను ఎదుర్కొనేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది. చివరికి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడానికి, ఆయనను ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంత రాజకీయం చేసిందో మనకు తెలిసిందే. అంబేడ్కర్‌ కూడా రాజ్యాధికారాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయారు. తను నిర్మించిన రిపబ్లికన్‌ పార్టీని నిలబెట్టలేకపోయారు. అది అప్పటి రాజకీయాలకు అనుగుణంగానే జరిగిందనవచ్చును. కానీ స్వాతంత్య్రం సాధించిన సమూహం ఏర్పాటు చేసిన పార్టీగా చెలామణి అవుతున్న కాంగ్రెస్‌ పార్టీని, అగ్రకుల బ్రహ్మాణవాదులను ఆనాడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తీవ్రస్థాయిలోనే ఎదిరించడం గొప్ప విషయం. అదే స్ఫూర్తితో పూర్తిస్థాయిలో రాజ్యాధికారం సాధించి సుధీర్ఘ కాలం జాతీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రాజకీయ చతురత కాన్షీరాందే.

కోట్లాది మంది బహుజనుల బాధలకు కారణాలు వెతికి వారికి ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని సాధించడం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు కాన్షీరాం. ఉన్నత ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలి పెళ్ళి చేసుకోకుండా, తన తండ్రి మరణిస్తే కూడా ఇంటికి వెళ్ళకుండా చనిపోయే వరకు బహుజనులకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో తన జీవిత కాలంలోనే పాక్షికమైన ఫలితాలు సాధించి దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు జరగడానికి కారణమయ్యాడు కాన్షీరాం. ఈ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, పార్లమెంట్‌ స్వీకర్‌, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాగా దళితులు కాగలిగారంటే అందుకు కాన్షీరాం చేసిన రాజకీయ పోరాటమే ప్రధాన కారణం.

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేవరకు పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్. ఆయ‌న జీవితం బ‌హుజ‌న‌లకు గొప్ప పాఠం. తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌హుజ‌న రాజ్యాధికారం కోసం కాన్షీరామ్ అడుగుజాడ‌ల్లో వెళ్లాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే ఇప్ప‌టికే బహుజ‌న రాజ్యాధికారం అంటూ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ల‌క్షకుపైగా ఓట్లు సాధించి తిరుగులేని ప్ర‌భావం చూపించారు తీన్మార్ మ‌ల్ల‌న్న. మ‌రోవైపు ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి బహుజ‌న రాజ్య‌ధికార నినాదంతో బీఎస్పీ జెండా ప‌ట్టుకున్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో బ‌హుజ‌న రాజ్యాధికార నినాదం గ‌ట్టిగా వినిపిస్తోంది. మ‌రి ఆ దిశగా అడుగులు ఎలా ప‌డుతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *