హుజురాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Latest News Political News

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే విధంగా బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతిచెందడంతో.. బద్వేల్‌లోనూ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఆరు నెలలలోగా.. అంటే డిసెంబర్‌ 12 లోగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

షెడ్యూల్‌ వివరాలు..

► అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
► నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
► అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన
► నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13
► అక్టోబర్ 30వ తేదీన పోలింగ్
► నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *