తెలంగాణ డ్రగ్స్ దందాలో బిగ్ బాస్

Editorial Latest News

డ్రగ్స్.. ఇప్పుడీ పదం దేశరాజకీయాలను కుదిపేస్తున్నది. గుజరాత్ లోని ముద్రా పోర్టులో పట్టుపడిన డ్రగ్స్ విషయమై బీజేపీని విపక్షాలు ప్రశ్నిస్తోంటే, మహారాష్ట్రలో నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్పులో డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడింది.. గుజరాత్, గోవా డ్రగ్స్ రాకెట్లతో ఏపీకి సంబంధాలున్నాయని, అధికార వైసీపీ నేతలే డ్రగ్స్ దందా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా, వారిపై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇటు దేశంలోనే ఐదో అతిపెద్ద మెట్రో నగరమైన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణలోనూ డ్రగ్స్ రాజకీయాలు గుప్పుమంటున్నాయి. కేంద్ర సంస్థ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసిన వాళ్లలో తెలంగాణకు చెందిన సిద్ధిక్ అహ్మద్ ఉండటం, హైదరాబాద్ శివారుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తూ ముంబై, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోన్న వైనాన్ని అతను వెల్లడించాడనే వార్తల నడుమ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు…

హైదరాబాద్ శివార్లలో యధేచ్ఛగా?
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గత నెలలో గోవాలో డ్రగ్స్ ముఠా ఒకదానిని పట్టుకోగా, ఆ గ్యాంగుకు హైదరాబాద్ తో సంబంధాలున్నట్లు వెల్లడైంది. ఈ మాఫియాలో కీలక పాత్రధారిగా భావిస్తోన్న సిద్ధిక్ అహ్మద్ హైదరాబాద్ వాసే. నగర శివార్లలోని కొన్ని పరిశ్రమల్లో డ్రగ్స్ ను తయారు చేసి, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు, ఇదంతా యధేచ్ఛగా సాగుతున్నట్లుగా సిద్దిక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు ఎన్సీబీగానీ, ఇటు తెలంగాణ పోలీసులుగానీ అధికారిక ప్రకటనలు చేయలేదు.

తెలంగాణ డ్రగ్స్ దందాలో బిగ్ బాస్
గుజరాత్, గోవాలో పట్టుపడ్డ డ్రగ్స్ రాకెట్లతో రెండు తెలుగు రాష్ట్రాలకు లింకులు ఉన్నాయని తేలడం లోకల్ గానూ రాజకీయ రచ్చకు దారితీసింది. ఏపీ డ్రగ్స్ మాఫియాకు జగన్ కింగ్ పిన్ అని టీడీపీ ఆరోపిస్తుండగా, తెలంగాణలో సాగుతోన్న డ్రగ్స్ దందాకు బిగ్ బాస్ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆరే అని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న ఓ పాపులర్ హీరోయిన్ కు మంత్రికి లింకుపెట్టి మాట్లాడారు. ఏపీ తరహాలో దాడులు లేనప్పటికీ తెలంగాణలోనూ డ్రగ్స్ వ్యవహారం క్రమంగా పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలో..

ఓవైపు ఏపీలో డ్రగ్స్ రాజకీయం పతాకస్థాయికి చేరగా, తెలంగాణలో మాదక ద్రవ్యాల కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రగతి భవన్ వేదికగా బుధవారం నాడు డ్రగ్స్ వ్యవహారంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ ను అరికట్టేలా పోలీస్, ఎక్సైజ్ శాఖను మరింత ఆధునీకరించాలని సీఎం భావిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బులపై నిషేధం వంటి అంశాలు కూడా అజెండాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో తెలంగాణలో వాటి కట్టడికి ఏం చేయాలో కేసీఆర్ నిర్దేశిస్తారు. హైదరాబాద్ శివార్లలోని ఆ అనుమానిత పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతారా? తెలంగాణ డ్రగ్స్ మాఫియాపై కేసీఆర్ మూడో కన్ను తెరుస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *