ఒక ఉప ఎన్నిక రాజకీయాలను మార్చేసింది.. ఒక లీడర్‌ను డల్ చేసింది.. మరో లీడర్‌ను లీడ్ ప్లేస్‌లో నిలట్టింది.. దిగజారుడు నాయకులకు దిమ్మతిరిగే పాఠం చెబుతోంది హుజురాబాద్ ఉప ఎన్నిక. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. అయితే, ఇప్పటికే నైతికంగా గెలిచిన నాయకుడు ఎవరో.. ఓడిన నాయకులు ఎవరో తేటతెల్లం అయిపోయింది. నవంబర్ పొలిటికల్ డర్ ఇప్పుడు చూద్దాం.
ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలనే మార్చుతోందా? అంటే అవుననే చెప్పకతప్పదు. మన రాష్ట్ర ముఖ్య నాయకుల తీరు ఏంటో ప్రజల ముందు బట్టబయలు చేస్తోంది హుజురాబాద్ ఉప ఎన్నిక. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా హుజురాబాద్ ఉప ఎన్నిక నిలిచింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్ భారీ వ్యూహాలకు తెరలేపింది. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనేది సామెత. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పెద్ద కర్రను మించిన.. అతి భారీ ఆయుధాలతో కొడుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదనే ప్రయత్నంలో ఉంది టీఆర్ఎస్. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రమే దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. అంతేకాదు రెండు నెలలుగా హుజురాబాద్‌లోనే మకాం వేసిన హరీష్ రావు ఈటలకు సపోర్టుగా ఉన్న చోటమోట లీడర్‌లందరినీ టీఆర్ఎస్ గూటికి లాగారు. ఈటల ఓటమికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మాటలకు కూడా పదును పెంచారు. హరీష్‌రావుతో పాటు ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్.. అంతా కలిసి ఈటలపై ఒక పెద్ద యుద్ధాన్నే ప్రకటించిన వాతావరణం కనిపిస్తోంది. హుజురాబాద్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కేసీఆర్ ఫ్యామిలీ లీడర్‌లు చేస్తోన్న హడావిడి.. వారికి పెద్ద డ్యామేజ్‌గా మారే పరిస్థితుల కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ పరిస్థితులు మారిపోతున్నాయి. కేసీఆర్ స్టార్ట్ చేసిన గేమ్ టీఆర్ఎస్‌కే డ్యామేజీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల పరిస్థితుల్లో కేవలం ఎన్నికల కోసమే కేసీఆర్ పథకాలు.. వరాల జల్లులు కురిపిస్తారని చెప్పడంలో విపక్షాలు కూడా సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నాయ్. ఫలితంగా సీఎం కేసీఆర్ మునుపెన్నడూ లేని ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారని తేల్చేసిందో జాతీయ మీడియా సంస్థ. తాజాగా నిర్వహించిన సర్వేలో కేసీఆర్ ఆఖరున ఉండడమే అందుకు నిదర్శనం.
ఇటీవల జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సీఎం కేసీఆర్‌పై 84 శాతం వ్యతిరేకత ఉందని తేల్చింది. తమ సర్వేలో ఎక్కువ మంది సీఎంపై వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపింది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనూ అలాంటి దారుణ ఫలితాలే వచ్చాయి. ఈసారి సీఎం కేసీఆర్ ఏకంగా ఆఖరి స్థానానికి పడిపోయారు. ప్రజాగ్రహంలో సీఎం కేసీఆర్ అందరు ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి మరీ చిట్టచివరలో నిలిచారు. ఇటీవల సర్వేలు చూస్తుంటే ఈటల ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించడానికి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అమలు చేస్తున్న వ్యూహాలు, ప్రయోగాలు వికటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎంతలా అంటే.. కేసీఆర్‌కు మించిన లీడర్‌గా ఈటలను నిలబెట్టేంత. ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ లీడర్‌గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక సీన్ కట్ చేస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నికల భాగంగా ఇటీవల కాంగ్రెస్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దీంతో పరిణామాలు మరింత రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ హుజురాబాద్‌లో వినిపిస్తోంది. కాంగ్రెస్ ఓటింగ్ టీఆర్ఎస్‌కు చావుదెబ్బగా మారొచ్చంటున్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచుతోంది. తామే టీఆర్ఎస్ మెడలు వంచుతామంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్, వివేక్ వంటి బీజేపీలోని బడా లీడర్‌లను సమీప భవిష్యత్‌లో తమ గూటికి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారు కాంగ్రెస్ పార్టీలోని ఇమడగలుగుతారని, త్వరలోనే తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ ధీమా. ఏదీఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయి. నవంబర్ నెలలో తెలంగాణ రాజకీయాల్లో ఊహించనంత మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. నవంబర్ పొలిటికల్ డర్‌ను ఎప్పటికప్పుడు మీ ముందుంచబోతున్నాం.