కదం తొక్కిన ప‌సుపు, చెరుకు రైతులు

Latest News Political News

మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, పసుపు పంటకు రూ.1500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్​చేస్తూ జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. మంగళవారం మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి వేలాది మంది రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ దగ్గర నేషనల్ హైవేపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకొని ప్రభ్యత్వమే నడిపిస్తుందని 2014 ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు. తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని టేకోవర్​చేసి ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. వానకాలం, యాసంగిలో పండించిన మక్కలు, వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు కనీసం రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల సర్వేను పకడ్బందీగా చేయించి పరిహారం అందజేయాలన్నారు.

ఎమ్మెల్యే రాజీనామా చేయాలె..
బై ఎలెక్షన్ లో గెలిచేందుకు ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడ్తోందని, ఎలెక్షన్లు వస్తేనే నిధులు మంజూరు చేస్తున్నారని రైతులు ఫైర్​ అయ్యారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కోసం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు, కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు తమకు వద్దని, పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. వరి వేస్తే ఉరి అని మాట్లాడిన సీఎం కేసీఆర్ వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయమంటున్న పంటలకు విత్తనాలు అందుబాటులో ఉంచారా? అని ప్రశ్నించారు. సీఎం సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలు వేస్తామని, కానీ మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనాలని డిమాండ్ ​చేశారు.

200 కోట్లతో ఫ్యాక్టరీ తెరిపించలేరా?
లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన టీఆర్ఎస్​ సర్కారు.. రూ. 200 కోట్లు కేటాయించి ముత్యంపేట, బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్​ చేయించలేదా? అని రైతులు మండిపడ్డారు. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. పసుపు పంటకు రూ.15 వేలు మద్దతు ధర, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన నాయకులు వెంటనే వాటిని నెరవేర్చాలని, లేదంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌కు పట్టిన గతే అందరికీ పడుతుందని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో ఆర్డీవో వినోద్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, గురజల రాజారెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సత్యం రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *