బ‌య‌ట‌ప‌డిన గులాబీ బాస్ అస‌లు రంగు

Editorial Latest News Political News

ఉద్య‌మ‌కారుల‌కు ద్రోహం – తెలంగాణ ముఖ‌చిత్రం

ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ఎస్ 20 ఏళ్ల పండ‌గ జ‌రుపుకుంది. తాజాగా జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీలో ఉద్య‌మ‌కారుల ప్ర‌స్తావ‌న లేకుండా, ఉద్య‌మ‌కారుల‌కు ఆ వేదిక‌పై అవ‌కాశం లేకుండా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గులాబీ జెండా ప‌ట్టుకుని పోరాడిన ఆ నాయ‌కులేరీ? తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన వారి కుటుంబ స‌భ్యులు ఏరీ? అనే మాటలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌తో ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీ ఇర‌వై ఏళ్ల త‌ర్వాత చూస్తే ఎంతో మార్పు కనిపిస్తోంది. గులాబీ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండా పోతున్న ప‌రిస్థితి ఉంది.

ఇటీవ‌ల ఈటెల రాజేందర్ భర్తరఫ్ తో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో తెలంగాణ ఉద్య‌మ‌కారుడైన ఈట‌ల రాజేంద‌ర్ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ ప్లీన‌రీ సాగిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్లీన‌రీ వేదిక‌పై టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ చేసిన ప్ర‌సంగంలో తెలంగాణ ఉద్య‌మ‌కాలంలో టీఆర్ఎస్‌లో ఉద్య‌మించిన నాయ‌కుల పేర్లుగానీ, ప్రాణ త్యాగం చేసిన వారి పేర్లు గానీ లేక‌పోవ‌డం ఆయ‌న తీరు ఏంటో మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు అయింది.

నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చూసే పార్టీలో ఎవరు స్ట్రాంగ్ అవుతున్నా, ప్రజల్లో వారికి ఎక్కువ ఆదరణ పెరుగుతున్నా, అలాంటి వారిని టార్గెట్ చేసి సైలెంట్ గా బయటికి పంపిస్తున్నారు సీఎం కేసీఆర్. కొందరిపై అభియోగాలు మోపి, మరికొందరికి పొమ్మనకుండా పొగ పెట్టి మరీ సాగనంపుతున్నారు. ఆలె నరేంద్ర, చెరుకు సుధాక‌ర్ వంటి వారి నుంచి ఇప్ప‌టి ఈటల వరకు.. కేసీఆర్ తీరు ఇదే. టీఆర్ఎస్ బలాన్ని పెంచుకోవడం కోసం ఇతర పార్టీలు ఇతర పార్టీల లీడర్లను, తెలంగాణ ఉద్య‌మాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన వారిని అక్కున చేర్చుకుంటూ, మొదటి నుంచి టీఆర్ఎస్ కోసం పనిచేసిన వారిని ఉద్యమకారులను బయటకు పంపించడం మాములు అయిపోయింది.

తల్లితెలంగాణా పార్టీ విజయశాంతిని పార్టీలో చేర్చుకుని బయటకు గెంటేసిన కేసీఆర్ తల్లి తెలంగాణ పేరుతో విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే విజయశాంతిని సైతం టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత బయటకు వెళ్లగొట్టారు. ఆలె నరేంద్ర పై అభియోగాలు మోపి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఎంతో పని చేసిన వారు, ఉద్యమకారులు మందాడి సత్యనారాయణ, కాశిపేట లింగయ్య, శనిగరం సంతోష్ రెడ్డి కెసిఆర్ తీరుతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ కోసం తొలి పీడీ యాక్ట్ జైలు శిక్ష అనుభ‌వించిన ఉద్య‌మ‌కారుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్‌కు గౌర‌వం ఇవ్వ‌లేక అవ‌మానించారు కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత‌ ఉద్య‌మ‌కారుల‌కు తీర‌ని ద్రోహం చేశార‌ని అప్ప‌ట్లో ఖ‌మ్మం స‌భ‌లో డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఇదే క్ర‌మంలో వరంగల్ ఎంపీగా గెలిచిన రవీంద్ర నాయక్ ను ఘోరంగా అవమానించి చివరకు ఆఫీస్ లోకి రానివ్వలేదు కేసీఆర్‌. జిట్టా బాలకృష్ణా రెడ్డి , రఘునందన్ రావు, గాదె ఇన్నయ్య ఇలా ఎందరో తెలంగాణ జాతర పేరుతో సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా అవమానించి బయటకు పంపేశారు. ఉద్యమంలో పాలుపంచుకున్న, కెసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన రఘునందన్ రావును కూడా ఇబ్బంది పెట్టారు. టిఆర్ఎస్ పార్టీ ప్రారంభంలో ఎంతో కష్టపడిన గాదె ఇన్నయ్య ను పక్కా ప్లాన్ ప్రకారం బయటకి తరిమారు. ప్రొఫెసర్ కోదండరాం ను ఘోరంగా అవమానించిన కేసీఆర్.. దాసోజు శ్రవణ్, రాములు నాయక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రేగులపాటి పాపారావు, ప‌ల్లె ర‌వికుమార్.. ఇలా ఎందరో నాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కెసిఆర్ అవమానాలను భరించలేక పార్టీని వీడి బయటకు వెళ్లారు. పొలిటికల్ జేఏసీ నేతగా అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను కెసిఆర్ ఘోరంగా అవమానించారు. ప్రొఫెసర్ కోదండరామ్ సొంతంగా పార్టీ పెట్టుకునేలా చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ను టిఆర్ఎస్ కు దూరం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లో ఉద్యమకాలను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాడు టిడిపిలో ఉండి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వారే . మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులంతా ఇతర పార్టీల నుండి వచ్చిన వారే. ఏదీఏమైనప్పటికీ హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో ట‌ర్న్ తీసుకోబోతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *