KCR కేబినెట్​లోకి ఆ నలుగురు!

Latest News Political News

బండ ప్రకాశ్​, కవిత, కడియం, వెంకట్రామిరెడ్డికి చాన్స్​
కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా గుత్తా, వైస్‌‌ చైర్మన్‌‌గా రమణకు అవకాశం

రాష్ట్ర కేబినెట్​లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కనుందనే దానిపై టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. హుజూరాబాద్​ బై ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్​ దీనిపై ఫోకస్​ పెట్టారు. కులాల లెక్కలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నలుగురిని కేబినెట్​లోకి తీసుకునే చాన్స్​ ఉంది. ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్​, : ఈటల రాజేందర్​ను తప్పించడంతో ఖాళీ అయిన మంత్రి పదవిని భర్తీ చేయటంతో పాటు, ఇప్పుడున్న మినిస్టర్లలో ముగ్గురిని తప్పించి కొత్తవాళ్లకు కేబినెట్​లో కేసీఆర్​ చాన్స్​ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్​ఎస్​ సీనియర్లు, వివిధ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన లీడర్లు, ఎమ్మెల్సీ చాన్స్ దొరికిన వాళ్లు ఆశలు పెంచుకున్నారు. ఒకవేళ కేబినెట్​లో మార్పులు జరగకున్నా.. ఈటలతో ఖాళీ అయిన మంత్రి పదవితో పాటు ఖాళీగా ఉన్న మండలి చైర్మన్, మండలి వైస్​ చైర్మన్​ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. బండ ప్రకాశ్​ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో వెకెట్​ అయిన రాజ్యసభ సీటుతోపాటు త్వరలో ఖాళీ కానున్న మరో రెండు రాజ్యసభ సీట్లలో ఎవరిని నామినేట్​ చేస్తారనేది కూడా ఆసక్తి రేపుతున్నది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్​ఎస్​లో చేరిన ఎల్​.రమణను కౌన్సిల్​ వైస్‌ చైర్మన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీలో ఉన్నారు.

కేబినెట్​లోకి బండ ప్రకాశ్​
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్​కు అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్​ అవకాశం ఇచ్చారు. ప్రకాశ్​కు స్టేట్​ కేబినెట్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈటల ​ బర్తరఫ్‌ తర్వాత ఖాళీ అయిన మంత్రి పదవిలోకి మరెవరినీ తీసుకోలేదు. ఈటల పోర్ట్​ పోలియోలో ఉన్న హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ బాధ్యతలను ఇటీవలే ఫైనాన్స్‌ మినిస్టర్‌ హరీశ్‌రావుకు అప్పగించారు. ఈటలను తప్పించడంతో ముదిరాజ్ కమ్యూనిటీ పార్టీకి దూరమైందని, హుజూరాబాద్​లో తమ ఓటమికి అదొక కారణమని టీఆర్​ఎస్​ నేతలు చర్చించుకుంటున్నారు. బీసీల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్న ముదిరాజ్‌ల అసంతృప్తిని చల్లార్చేందుకు అదే కులానికే చెందిన బండ ప్రకాశ్‌ను తెరపైకి తెచ్చారు.

కవిత.. కడియం.. మాజీ కలెక్టర్​
ఎమ్మెల్సీ కవితను కేబినెట్‌లోకి తీసుకోవడంపై డైలమా నడుస్తోంది. మరోసారి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎన్నికైన ఆమె మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కూడా కేసీఆర్​ తన కూతురు కవితకు కేబినెట్​లో చోటు ఇస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. కులాల లెక్కల దృష్ట్యా ఈసారి కేబినెట్​లో ఒక ఎస్సీకి చాన్స్​ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ మంత్రి కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కొచ్చు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని సీఎం వద్ద ఉన్న రెవెన్యూ శాఖ అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది. అదే భరోసాతో వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకొని ఎమ్మెల్సీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు టీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నారు. కేబినెట్​ మార్పులు జరిగితే తమకు అవకాశం దక్కుతుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, చీఫ్‌ విప్‌ ధాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందతో పాటు పలువురు లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. కొందరికి కేసీఆర్​ ఇప్పటికే భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కులాల లెక్కల్లో కేబినెట్​ కూర్పు
ప్రస్తుత కేబినెట్‌లో సీఎం కేసీఆర్​సహా 17 మంది మంత్రులున్నారు. రెడ్డి కులం నుంచి ఆరుగురు, వెలమ కులం నుంచి నలుగురు (సీఎం సహా), కమ్మ కులానికి చెందిన ఒకరు, బీసీలు ముగ్గురు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కొక్కరు మంత్రివర్గంలో ఉన్నారు. కులాల లెక్కల దృష్ట్యా ఎస్సీల నుంచి మరొకరికి మంత్రిగా అవకాశమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్​ నుంచి ముగ్గురిని తప్పించి.. తిరిగి ఇద్దరు ఓసీలు, ఒక ఎస్సీకి చాన్స్​ ఇస్తారని టీఆర్​ఎస్​లో చర్చ జరుగుతోంది.

గుత్తాకే మళ్లీ మండలి చైర్మన్ పదవి..
ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. గుత్తా సుఖేందర్​ రెడ్డినే మళ్లీ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా నియమిస్తారని సమాచారం. మంత్రివర్గంలో చోటు ఆశించిన గుత్తాను గత టర్మ్​లోనూ కౌన్సిల్​ చైర్మన్​గా నియమించారు. ఈసారి కూడా ఆయనకు అదే పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.

డిసెంబర్‌‌ చివరిలోపే పదవుల భర్తీ
మండలి ప్రొటెం చైర్మన్‌‌గా ఉన్న భూపాల్‌‌రెడ్డి పదవీకాలం వచ్చే జనవరి 4తో ముగియనుంది. ఆలోగా మండలికి కొత్త చైర్మన్‌‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు కౌన్సిల్‌‌ను సమావేశ పర్చడం తప్పనిసరి. డిసెంబర్‌‌ 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే మండలిని సమావేశపరిచి కొత్త చైర్మన్‌‌ ఎన్నికకు ప్రొటెం చైర్మన్‌‌ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌‌ జారీ చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో కేబినెట్‌‌ విస్తరణ కూడా ఉంటుందని సమాచారం.

రాజ్యసభ సీట్లు ఎవరికో?
ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన బండ ప్రకాశ్‌ ఒకటీరెండు రోజుల్లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. జూన్‌లో కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, డి. శ్రీనివాస్‌ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ రెండు స్థానాలకు ఫిబ్రవరిలో షెడ్యూల్‌ జారీ అయి, మార్చిలో ఎన్నిక జరగనుంది. వాటితో పాటే బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారని తెలుస్తోంది. బండ ప్రకాశ్‌ స్థానంలో వెలమ కులానికి చెందిన వ్యాపారవేత్త దామోదర్‌ రావుకు ఎంపీగా చాన్స్‌ ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. డి.శ్రీనివాస్‌ చాలాకాలంగా టీఆర్​ఎస్​కు దూరంగా ఉంటున్నారు. వయసురీత్యా కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుకు రెన్యూవల్‌ దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల నుంచి ఎవరిని రాజ్యసభకు పంపుతారనే దానిపైనా చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *