తెలంగాణ జాగృతి పాటలో
తెలంగాణ జాగృతమేదీ?
మన బతుకమ్మలో మనమేదీ..
తెలంగాణ యాసబాసల గోసేది?
బొట్టు ఏదీ? బోనం ఏదీ?
మా పల్లె ఏది మా ముల్లె ఏది..
మా జనమేరీ? మా ఘనులేరీ?
జానపదాల కిల్లాలోకి
కిరాయి సంగీతకారులా?
ఎంతో దృక్పథమున్న నేలపైకి
పరాయి దర్శకులా?
ఆటపాటల కోటలోకి
ముంబై కొరియోగ్రఫీనా?
తమిళ సంగీతం
కేరళ దర్శకత్వం
ముంబై నృత్యం
ఆంధ్ర నాట్యం..తో
నా బతుకమ్మ పాటా?
నా బాసేది
నా యాసేది
నా గుండె గోసేది?
నేనెక్కడ ???
నా కవిత్వమెక్కడ
నా కావ్యమెక్కడ?
నా నృత్యమెక్కడ?
నా నాట్యమెక్కడ?
నా జానపదమెక్కడ?
బతుకమ్మ పాటలో
నా బతుకేదే గౌరమ్మా!
కోట్లు కుమ్మరించి
ఆ కూనీరాగాలేంటే
కవితమ్మా!
- ఆది