Lambasingi Movie Review

Latest News

బిగ్‌బాస్ ఫేం దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా లంబసింగి (Lambasingi). డిఫరెంట్ అండ్ నాచురల్ టైటిల్ తో రూపొందించిన ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
లంబ‌సింగి పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌ వీర‌బాబు (భ‌ర‌త్‌రాజ్‌) తొలిచూపులోనే హరిత(దివి) అనే న‌ర్సును చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. హ‌రిత‌కు త‌న ప్రేమ‌ను ప్ర‌పోజ్ చేస్తాడు వీర‌బాబు. కానీ ఆమె మాత్రం వీర‌బాబు ప్ర‌పోజ‌ల్‌కు నో చెబుతుంది. ఓ రోజు వీర‌బాబు డ్యూటీలో ఉండ‌గా లంబ‌సింగి పోలీస్ స్టేష‌న్‌పై న‌క్స‌లైట్లు దాడి చేస్తారు. ఆ ద‌ళం స‌భ్యుల్లో కోన‌ప్ప‌తో పాటు హ‌రిత కూడా ఉంటుంది. ఆమె న‌ర్సు కాదు న‌క్స‌లైట్‌ అనే నిజం తెలిసి వీర‌బాబు ఏం చేశాడు? వీర‌బాబు ప్రేమ‌ను హ‌రిత అర్థం చేసుకుందా? హ‌రిత‌ను ద‌ళం స‌భ్యులు ఎందుకు అనుమానించారు? వీర‌బాబు ప్రేమ కోసం ఆమె ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింది? అనేది తెలుసుకోవాలంటే లంబ‌సింగి సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌:
పోలీస్ కానిస్టేబుల్ వీరబాబు పాత్రలో భరత్ రాజ్ బాగా చేశాడు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ఇన్నాళ్లు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో తానేంటో నిరూపించుకుంది. ఓ పక్క ప‌క్కా పల్లెటూరి అమ్మాయిలా నటించి, మరోవైపు నక్సలైట్ గా కూడా నటించి తాను భిన్న కోణాల్లో న‌టించి మెప్పించ‌గ‌ల‌ని నిరూపించుకుంది. కోనప్ప, పోలీస్ ఆఫీసర్, మరో పోలీస్ కానిస్టేబుల్, రాజుగారు, రాజుగారి భార్య పాత్రల్లో నటించిన నటీనటులు కూడా ఫర్వాలేదనిపిస్తారు. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
డైరెక్ట‌ర్ నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ని తెర‌పై అందంగా చూపించాడు. కెమెరా విజువల్స్, సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమాలోని పాటలు గతంలో 1990, 2000 సంవత్సరాల్లో వచ్చిన సినిమాల్లో ఉండే సాంగ్స్ లా అనిపిస్తాయి. ప్రేమకథకు అలాగే నక్సలైట్ కథకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. లంబసింగి అందాలను ప్రతి ఫ్రేమ్ లోను చక్కగా చూపించారు. సినిమా అంతా లంబసింగి ఆ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేశారు. లంబసింగి చూడని వారు కూడా ఆ ప్రదేశం ప్రకృతితో ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్ఆర్ ధృవన్ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

విశ్లేషణ:
మొత్తంగా లంబసింగి సినిమా ఓ పోలీస్ కానిస్టేబుల్, లేడీ నక్సలైట్ మధ్య జరిగే ప్రేమ కథ. సరదాగా సాగుతూనే ట్విస్టులు ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. దర్శకుడు నవీన్ గాంధీ సెల‌క్ట్ చేసుకున్న స‌బ్జెక్టు బాగుంది. ఫస్టాఫ్‌లో కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ఇంకా సూప‌ర్. ఇక సెకండాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని కూడా ఫ‌ర్‌ఫెక్టుగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో క‌లిసి థియేటర్లలో చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 3.5 / 5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *