Huzurabad Survey: హుజురాబాద్‌లో స‌ర్వే ఫ‌లితాలు

Editorial Latest News

హుజురాబాద్‌లో గెలిచే అవ‌కాశం ఎవ‌రికి ఉంది? ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారు? ఎవ‌రిని ఓడించ‌బోతున్నారు? హుజురాబాద్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముంది? ఇటీవ‌ల హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మా ఛాన‌ల్ బృందం ప‌ర్య‌టించి అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో మేము హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సేక‌రించిన స‌మాచారం మీ ముందుంచుతున్నాం.

హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయ‌డంతో రాజ‌కీయం మ‌రింతా వేడెక్కింది. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎవ‌రిని గెలిపించుకోబోతున్నార‌నే విష‌యం రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సేక‌రించిన ప్ర‌జా అభిప్రాయ సేక‌ర‌ణ‌లో ఎన్నో కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ ఉప ఎన్నిక పార్టీల పరంగా కాదు ఈటల రాజేందర్‌ వర్సెస్ కేసీఆర్‌గా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ద‌ళిత బంధు ప‌థ‌కం త‌మ‌కు వ‌స్తే టీఆర్ఎస్‌కు ఓటేస్తామ‌ని ద‌ళితులు అధిక సంఖ్య‌లో చెప్పారు. అయితే ద‌ళిత యువ‌త మాత్రం కాస్త భిన్నంగా క‌నిపిస్తోంది. త‌మ‌కు ద‌ళిత బంధు ప‌థ‌కం వ‌చ్చినా కూడా ఈట‌ల‌కు ఓటేస్తామ‌ని కొంద‌రు యువ‌కులు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వంద శాతం ద‌ళిత బంధు అమలు కాలేదు. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు కాని వారు అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ద‌ళిత బంధు ప‌థ‌కం త‌మ‌కు ఎందుకు ఇవ్వ‌రంటూ ద‌ళిత‌ వృద్ధులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి ఉంది. ద‌ళిత బంధు ప‌థ‌కం మాదిరిగానే త‌మ‌కూ ఇవ్వాలంటూ బీసీ, ఓసీలు కూడా అడుతున్నారు. బీసీ, ఓసీల్లో ఉండే పేద‌ల‌కు ఓసీబంధు, బీసీ బంధు.. ఎందుకు ఇవ్వ‌డం లేదంటూ ఆయా సామాజిక‌వ‌ర్గాల నుంచి నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టీఆర్ఎస్ ప‌రిస్థితి చూస్తే…
హుజురాబాద్‌లో గులాబీ పార్టీ గ‌ట్టిగా పోరాడుతోంది. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను వ్యూహాత్మకంగా అభ్యర్థిగా ప్రకటించింది. బీసీ ఓటర్లకు గాలం వేసింది. పైగా కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం.. ఈ నియోజకవర్గానికే చెందిన వ్యక్తికి ఎస్పీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. వీటికితోడు దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా 10 లక్షల నగదు సాయం పథకం ‘దళితబంధు’ ప్రకటించడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీశ్‌ రావు హుజురాబాద్‌లోనే కొంత‌కాలంగా ఉంటున్నారు. తరచూ పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగార్జునసాగర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్‌ఎస్‌కు విజయయాత్ర హుజురాబాద్‌తో కొనసాగించాలని భావిస్తోంది. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్‌కు, కారు గుర్తుకు ఓటేస్తామని, చెప్పిన చాలామందిలో గెల్లు శ్రీ‌నివాస్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పారు. 22 వేల మంది ఓట‌ర్లు ఉన్న యాద‌వ సామాజిక‌వ‌ర్గం అధిక శాతం టీఆర్ఎస్‌పై సంతృప్తిక‌రంగా ఉన్నారు. యాద‌వుల‌కు ఇంటింటికి గొర్రెల పంపిణి చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. అయితే ప్రతికూలతలు ఏమున్నాయంటే.. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం. ఏడున్నరేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చేటు చేసేలా ఉంది.

నియోజ‌క‌వ‌ర్గంలో 26 వేల మంది ఓట‌ర్లు ఉన్న‌ ప‌ద్మ‌శాలి కుల‌స్తులు మాత్రం ప్ర‌భుత్వం త‌మ‌కు ఇంత వ‌ర‌కు ఏం చేయలేద‌ని టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. 24వేల‌పై చిలుకు ఓట‌ర్లు ఉన్న‌ గౌడ సామాజికవ‌ర్గం కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై అసంతృప్తిక‌రంగా ఉంది. గౌడ‌న్న‌ల‌కు మోపెడ్‌లు టీఆర్ఎస్ స‌ర్కార్ ఇస్తామ‌ని చెప్పిన కూడా వారిలో సంతృప్తి క‌నిపించ‌డం లేదు. వీరిలో అధిక శాతం ఓట్లు ఈట‌ల‌కు ప‌డే అవ‌కాశం ఉంది.

http://primetodaytv.com/latest-news/prime-today-huzurabad-survey-results/

ఇక బీజేపీ ప‌రిస్థితి చూస్తే…
బీజేపీకి ఇక్క‌డ ఓటింగ్ శాతం చాలా త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ఈట‌ల‌కు స్థానికంగా ఉన్న బ‌ల‌మే ఆ పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బీజేపీ కంటే వ్య‌క్తిగ‌తంగా ఈట‌ల‌ను చూసి ఓటేస్తామ‌ని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఈట‌ల బీజేపీలోకి వెళ్ల‌డం త‌ప్పు అనే అభిప్రాయాలు ఆయ‌న అభిమానుల నుంచి వినిపించాయి. ఇక ఈట‌ల ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా రెండుసార్లు చుట్టేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడింది. 23 వేల‌పై చిలుకు ఓట‌ర్లు ఉన్న ముదిరాజ్ సామాజికవ‌ర్గంలో స‌గం కంటే ఎక్కువ శాతం ఈట‌ల‌కు అనుకూలంగా ఉంది. ఈట‌ల సామాజిక వ‌ర్గం ఇది. బలహీనతల విషయానికి వస్తే హుజురాబాద్‌ అభివృద్ధిలో వెనకపడి ఉండడం.. అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటలకు చేటు చేసేలా ఉంది. బీజేపీ నాయకత్వం సహకరించపోవడం కూడా కొంత ప్రభావం చూపనుంది. ఈ ఎన్నిక ఈటలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా మారింది.

22వేల‌పై చిలుకు ఓట‌ర్లు ఉన్న రెడ్డి సామాజికవ‌ర్గం ఓట్లు చీలిపోయేలా క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డేలా క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ కాంగ్రెస్ ఓటుబ్యాంకు కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్‌కి-బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితి ప్ర‌స్తుతం లేద‌నే చెప్పాలి. ఏ నాయ‌కుడిపై విశ్వాసం చూపించ‌ని వారి సంఖ్య కూడా ఉంది. క‌నీసం 4 శాతం మంది నోటాకు ఓటేసే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌లు ఎంత ఆల‌స్యం అయితే అంత టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని హుజురాబాద్‌లో నియోజ‌క‌వ‌ర్గంలో స్థానికంగా విశ్లేష‌ణ‌లు వినిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *