తెలంగాణ రాజకీయాల్లో మరో అలజడి మొదలైందా? బీసీ ఉద్యమం తీవ్రరూపం దాల్చబోతోందా? కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారబోతున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. బీసీ కులాలపై జరుగుతోన్న అణిచివేతకు నిరసనగా డాక్టర్ చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో కొత్త ఉద్యమం మొదలైనట్టే కనిపిస్తోంది.
సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతోందంటూ బీసీ కులాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అఖిల పక్ష సమావేశాలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగినప్పటికీ బీసీలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. గిరిజనులు, ఆదివాసీలు, దళితుల సమస్యలపై చర్చలు జరుపుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అడుగడుగున అన్యాయమే చేస్తున్నాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ మండిపడ్డారు. బీసీ కులాల గణనను చేపట్టకుండా తాత్సారం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును డాక్టర్ చెరుకు సుధాకర్ ఎండగడుతూ నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బహుజనులకు అన్యాయం చేసే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని, ఆ ప్రభుత్వాలను దింపుతామని ఆయన అన్నారు. ప్రభుత్వ పీఠాలపై బీసీ జెండా ఎగరేస్తామన్నారు.
బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు తేలాలి. అయితే ఈ విషయాన్ని దాటవేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు బీసీ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. బీసీ కులాల జనాభా గణన చేపట్టాలంటూ ఇటీవల డాక్టర్ చెరుకు సుధాకర్ అఖిల పక్షనాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ గణన చేపట్టాల్సిందేనని అఖిలపక్ష నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా తక్షణమే బీసీ కుల గణన చేయకపోతే దేశంలోని 70 కోట్ల మంది బీసీలు అన్యాయానికి గురవుతారని చెరుకు సుధాకర్ చెప్పుకొచ్చారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఎందుకు కేటాయించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయని బీజేపీకి గుణపాఠం చెప్పాలంటూ ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఊరూరా ఉద్యమజెండాలు ఎత్తుతామన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డాక్టర్ చెరుకు సుధాకర్ చేస్తున్న డిమాండ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అలజడిరేపుతోంది. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్.. వెనుకబడిన కులాలకు తీరని అన్యాయం చేస్తున్నాయంటూ రెండు ప్రభుత్వాలపై ఎక్కుపెట్టిన బీసీ బాణం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
తెలంగాణ ఇచ్చిందే 93 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమని అనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పారని, ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోవాలని చెరుకు సుధాకర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఈ అంశంపై తమ పార్టీ చర్చిస్తుందని స్పష్టం చేశారు. బీసీ కుల సంఘాల నాయకులతో పాటు, అఖిల పక్ష నేతల మద్దతు కూడగడుతూ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగిస్తోన్న చెరుకు సుధాకర్‌కు వెనుకబడిన కులాల నుంచి మద్దతు లభిస్తోంది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలన్ని క్రమంగా ఏకమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.