రూ. 200 కోట్ల మనీలాండారింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్.. తనపై చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు తనకు సుకేష్ ఎవరో కూడా తెలియదన్నారు. తానూ ఎప్పుడూ కూడా అతని గురించి వినలేదన్న కేటీఆర్.. అతడు చేసిన హాస్యాస్పదమైన ఆరోపణలు మీడియా ద్వారానే తన దృష్టికి వచ్చాయన్నారు. సుకేష్ వ్యాఖ్యలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అతడు చేసినవి మతిలేని ఆరోపణలని అన్నారు కేటీఆర్ . సుకేష్ లాంటి నేరస్తుడు, మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ కు సంచలన లేఖ
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఈ లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ లపై సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని సుకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు.
దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కవితకు తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు సుకేష్. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశానని, కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశానని, ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్టుగా గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు సుకేష్.