రంగంలోకి దిగిన టీఆర్ఎస్ ఈటల తర్వాత.. టార్గెట్ తీన్మార్ మల్లన్న PRIME TODAY సంచ‌ల‌న క‌థ‌నం

Latest News

తమకు వ్యతిరేకంగా గళమెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పకడ్బందీగా సాగనంపిన టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మరో అసమ్మతి వాదిపై పడిందన్న చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఇప్పుడు తమ ఫుల్ ఫోకస్ ను మరొకరిపై పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్యాడ్యూయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన జర్నలిస్ట్ సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్నను లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మచ్చలేని మనిషిగా పేరొందిన ఈటల రాజేందర్ పై భూ ఆక్రమణ ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించారు. ఇక తనను తాను రక్షించుకోవడానికి బీజేపీలోకి ఈటల చేరాల్సి వచ్చింది. ఆయన బీసీ నినాదం ఎత్తితే.. ‘దళితబంధు’తో కేసీఆర్ దెబ్బకొట్టారు. ఇప్పుడు ఈటల చాప్టర్ క్లోజ్ చేసిన టీఆర్ఎస్.. తమ కంట్లో నలుసులా మారిన తీన్మార్ మల్లన్నపై అవినీతి ఆరోపణలను తెరపైకి తీసుకొస్తోందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

శనివారం అకస్మాత్తుగా.. తీన్మార్ మల్లన్న ‘క్యూచానెల్’ యూట్యూబ్ చానెల్ బ్యూరో చీఫ్ అయిన చినుకా ప్రవీణ్ బయటకు వచ్చేశారు. ఆయన తీన్మార్ మల్లన్న గురించి సంచలన నిజాలు చెబుతూ హోరెత్తించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

మున్నురుకాపు కులానికి చెందిన మల్లన్నకు దళితుల పట్ల ఎలాంటి ఆందోళన లేదని.. కానీ దళితుల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని ప్రవీణ్ ఆరోపించారు. ‘క్యూ’ న్యూస్ చానెల్ లో ఒక్క దళితుడు కూడా లేడని విమర్శించారు. మల్లన్న తన కుటుంబ సభ్యులందరిని కీలక స్థానాల్లో పెట్టాడని విమర్శించాడు. మల్లన్న తన సొంత కులానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తాడు అని చెప్పాడు.

మల్లన్న తన యూట్యూబ్ చానెల్ పేరుతో ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నాడు. మల్లన్న ఏకైక ఏజెండా కేసీఆర్ పై దాడి చేయడమేనని అన్నారు.

పార్టీలో కుటుంబ పాలనను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్న తీన్మార్ మల్లన్న తన చానెల్ లో కుటుంబసభ్యులందరినీ ఎందుకు పెట్టాడని ప్రవీణ్ ప్రశ్నించాడు.

సామాజిక సేవ పేరుతో తీన్మార్ మల్లన్న రూ.50 కోట్లు వసూలు చేయాలని యోచిస్తున్నాడని ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు కొత్త పార్టీని ప్రారంభిస్తానని.. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని పేర్కొంటూ చాలా మంది నుంచి డబ్బులు సేకరించాడని.. గతంలో మల్లన్న కేసీఆర్ నుంచి కూడా విరాళాలు తీసుకున్నాడని ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. మల్లన్న క్యాబిన్ లో రూ.2 కోట్ల నగదు దొరికిందని ప్రవీణ్ ఆరోపించారు. ‘ఈ నగదు గురించి నేను ఆరాతీసినప్పుడు మల్లన్న తనతో గొడవపడ్డాడని.. నన్ను చానెల్ నుంచి తీసివేశాడని’ ప్రవీణ్ చెప్పాడు. మల్లన్న దుశ్చర్యలను త్వరలోనే బయటపెడుతానని ప్రవీణ్ ప్రకటించారు.

మల్లన్న టీంకు చెందిన మరో ఇద్దరు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి రూ.500 కోట్లు వసూలుచేశారని ఆరోపించారు. ‘ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ కు రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చింది తీన్మార్ మల్లన్ననే’ అని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

అయితే తీన్మార్ మల్లన్నను ఎలాగైనా సరే దెబ్బతీయాలని టీఆర్ఎస్ ఎప్పటి నుంచో చూస్తోందని.. అందుకే ఇలా ప్లాన్ చేసిందని మల్లన్న టీం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది నిజం..? ఏది అబద్దమో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *